మహబూబ్‌నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు గులాబీయమంగా మారింది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జననీరాజనం లభించింది. సర్పంచుల సన్మాన సభ.. మున్సిపల్ ఎన్నికల శంఖారావానికి ఊహించని రీతిలో భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. కేటీఆర్‌కు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. బైపాస్ వద్ద బీఆర్ఎస్ జిల్లా నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అప్పనపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏనుగొండ, శ్రీనివాస, పద్మావతి కాలనీ మీదుగా క్లాక్ టవర్.. ఎంబీసీ మైదానానికి మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడగునా కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. దీంతో పాలమూరు జనసంద్రంగా మారింది. అన్ని జంక్షన్ల వద్ద ప్రజలు జనం బ్రహ్మరథం పట్టారు. సభా స్థలం సరిపోకపోవడంతో చాలామంది దూరంగా నిలబడి సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించారు. ఇక కేటీఆర్ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ఒక్కొక్కటిగా వివరించడంతో జనం చప్పట్లతో కేరింతలు కొట్టాడు. కేటీఆర్ సభాస్థలికి రాకముందే వేదిక మొత్తం నాయకులతో నిండిపోయింది.
అభిమాన నేత కేటీఆర్‌ను సన్మానించేందుకు నేతలంతా పోటీపడ్డారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా పిలిచి సన్మానించారు. కేటీఆర్ పర్యటనలో కనపడని పోలీసులు ఈసారి మాత్రం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావడం ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ పైసలు ఇవ్వడం లేదు.. మీరు నమ్మి మళ్లా అభివృద్ధి అని అంటే ఆ పార్టీలో చేరి మోసపోకండి అని కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యేలకే అభివృద్ధికి పైసలు ఇయ్యనోడు సర్పంచులకు ఎలా ఇస్తాడని ప్రశ్నించారు. దీంతో సర్పంచులంతా గట్టిగా అవును.. అవును అంటూ అన్నారు. రెండేళ్లు ఆగండి.. ఆ తర్వాత మనదే ప్రభుత్వమని కేటీఆర్ అనడంతో వారంతా లేచి ఇలలు వేశారు. మొత్తానికి కేటీఆర్ పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
యాభై ఏండ్లు గ్రామాలకు మంచినీరు ఇవ్వనీ కాంగ్రెస్ నేతలు ఇవాళ మళ్లీ అదే పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో సర్పంచులుగా ఉన్నవాళ్లు గెలిస్తే ప్రతి ఊళ్లో మంచినీటి సమస్య పెద్ద సవాలుగా ఉండేది అన్నారు.
అప్పట్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచులుగా ఉన్నవాళ్లు మాకు ఫోన్ చేసి సార్ మా ఊళ్లో కరెంట్ లేదు మోటర్ కాలిపోయింది, నీళ్లు రావడం లేదు అని కష్టాలు చెప్పుకునే వారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి గ్రా మాల్లో ఇంటింటికీ నల్లా పెట్టించి తాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇవాళ ఎక్కడా సమస్యలు లేవు అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందిస్తున్నామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయని.. కరెంటు కోతలు నీటి ఇబ్బంది తప్పేలా లేవన్నారు. మోసపూరిత కాంగ్రెస్‌ను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలన ఏ విధంగా కొనసాగిందో చూసాం. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో చూస్తున్నారు.. అని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కసిగా కొట్లాడారు. అధికార పార్టీని ఎదిరించి బీఆర్ఎస్ సర్పంచులు విజయం సాధించారన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి విజయం సాధించారు. ఇదే కసితో కొట్లాడితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే వాళ్లం అని అన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్, నాయకుడితో సంబంధం లేకుండా మనోడే కుర్చీ మీద కూర్చోవాలి అనే పట్టుదలతో ఉండాలన్నారు.