పెబ్బేరు, సెప్టెంబర్ 30 : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ ఏమైందని పెబ్బేరు మండల బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోమవారం సుభాశ్ చౌరస్తా లో రైతులతో కలిసి వారు పెద్దఎత్తున రాస్తారోకో, తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారికి వినతిప త్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వనం రాములు, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులను పక్కనబెట్టి, ఆరు హామీలను తుంగలో తొక్కి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, మూడు వందల రోజులు దాటినా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు.
రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్ల పెంపు, మహిళలకు గృహలక్ష్మి పథకం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పి వాటి జోలికే పోవడం లేదని వారు విమర్శించారు.ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో డీటీ లక్ష్మీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్దింటి వెంకటేశ్, మధు, ఎల్లారెడ్డి, వెంకటన్నగౌడ్, వీరస్వామి, వేణు, గోవిందు, రమేశ్ పాల్గొన్నారు.