మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి పల్లె ఎదురు చూస్తున్నది.. ఊరు వాడా ఏకమై చలో వరంగల్ అంటున్నది.. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ఇరవై ఐదేండ్ల పండుగ మీదే చర్చ జరుగుతున్నది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి సాధించి.. పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై ఆకాంక్షల తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా బాసటగా నిలుస్తోంది.. పట్టణాల నుంచి పల్లెల దాకా.. పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారు.
ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సభకు దాతలు విరాళాల రూపంలో తమ కష్టార్జితాన్ని అందించి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జై కేసీఆర్ జై బీఆర్ఎస్.. రజతోత్సవ సభకు తరలిరండి.. జయప్రదం చేయండి అంటూ వాల్ రైటింగ్‌లతో హోరెత్తించారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో భారీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున చలో వరంగల్ సభకు తరలి వెళ్లేలా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి 25 ఏండ్ల పండుగలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఏ తెలంగాణ కోసం అయితే పార్టీని స్థాపించారో.. ఆ ఉద్యమ నేత వెంబడి పాలమూరు అడుగులో అడిగేసింది. తెలంగాణ కోసం ఉద్యమించిన అధినేత కేసీఆర్‌కు 2009లో పాలమూరు జనం నీరాజనం పలికి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఎంపీగా ఉంటూనే కేసీఆర్ తెలంగాణ సాధించడంతో పాలమూరు జిల్లా పేరు చరిత్రలో నిలిచిపోయింది. మళ్లీ చరిత్రను తిరగరాసేలా సభకు వేలాదిగా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
పార్టీ ఆవిర్భావ సభ వరంగల్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా కవులు, కళాకారులు రాసి పాడిన పాటలు గ్రామాల్లో హోరేత్తిస్తున్నాయి. తప్పు చేశాం కేసీఆర్… చలో వరంగల్… బండెనుక బండి కట్టి.. ఆగం అయిపోతున్నది తెలంగాణ.. అంటూ కళాకారులు పాడిన పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విఫ లం కావడం.. మళ్లీ కేసీఆర్ పాలన ప్రజలు తలుచుకునేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సభ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడ చూసినా గ్రామాల్లో.. రచ్చ కట్టల దగ్గర చాయ్ హోటళ్ల దగ్గర కేసీఆర్ గురించే చర్చిస్తున్నారు. సెల్ ఫోన్లో కేసీఆర్ ధూంధాం పాటలు ఆకట్టుకుంటున్నాయి.
ముందుకొచ్చిన దళితబంధు లబ్ధిదారులు రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన
కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర లోపలే విఫలం కావడంతో జనం బీఆర్ఎస్ పార్టీపై.. కేసీఆర్ నాయకత్వంపై మళ్లీ ఆశలు పెంచుకున్నారు. పార్టీ 25 ఏండ్ల పండుగకు ఊరువాడ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు మాజీ ఎమ్మెల్యేలకు అందజేస్తున్నారు.
కొన్నిచోట్ల పార్టీ నేతలు కూలి పనులు చేస్తూ చందాలు వసూలు చేసి.. సభకు కార్యకర్తలను తరలించేందుకు నిధులు సమీకరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ… తాము కూడా కార్యక్రమంలో భాగస్వాము లమవుతామని ప్రకటిస్తున్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు పార్టీకి రూ.32,500/- నగదును దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి అందజేశారు.
పార్టీ ఆవిర్భావ సభ వరంగల్‌లో ఈ నెల 27 నిర్వహిస్తున్న సందర్భంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సంసిద్ధమవు తున్నారు.. చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వెళ్లేందుకు వాహనాలు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల దళిత బంధు లబ్ధిదారులు.. రైతులు.. యువకులు పార్టీ సభకు విరాళాలు అందజేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ సభకు ఊహించని స్పందన వస్తోంది. కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లు పార్టీ నేతలకు స్ఫూర్తి నిస్తున్నాయి. ఎండలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్‌ను దీవించేందుకు వస్తున్నారు. పార్టీ పరంగా కూడా గ్రామగ్రామాల నుంచి సభకు ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..
– లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు
భారత రాష్ట్ర సమితి 25 ఏండ్ల పండుగ సందర్భంగా ఈ నెల 27న ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా కదులుతున్నది. ఇప్పటికే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో మాజీ మంత్రులు, అలంపూర్ ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున వాల్ రైటింగ్ రాయించారు. ఎక్కడ చూసినా ‘కేసీఆర్ జిందాబాద్’, ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’, ‘చలో వరంగల్’.. ‘25 ఏండ్ల పండుగను జయప్రదం చేయండి’ అన్న కొటేషన్లు కనిపిస్తున్నాయి. వీటితో పల్లెలన్నీ గులాబీమయం కావడానికి తోడు ప్రతి ఒక్కరినీ ఉత్సాహ పర్చుతున్నాయి. అంతేకాకుండా పలువురు నాయకులు ఇంటింటికీ వెళ్లి వరంగల్‌కు తరలిరావాలని, కేసీఆర్ సార్‌గా బాసటగా నిలవాలని ప్రజలను ఆహ్వానిస్తున్నారు.