బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్ర చేపట్టనుంది. కేటీఆర్‌తోపాటు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్ మరమ్మతుల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించనున్నారు. హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. అన్నారం వద్ద ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు పర్యవేక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు శుక్రవారం బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర చేపట్టింది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన సాకుతో అసలు ప్రాజెక్టే పనికి రాదనే కుట్రలకు తెరలేపి ప్రాజెక్టును నీటిపాలు చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు దీటైన కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు సుమారు 500 మంది నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు భూపాలపల్లికి చేరుకుంటారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కాసేపు ఆగి భోజనాలు చేసి అక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్‌కు చేరుకుని కుంగిన పిల్లర్లను పరిశీలిస్తారు. మిగిలిన వాటి పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుని పరిశీలిస్తారు. చివరికి అన్నారానికి చేరుకుని సీపేజ్‌లు, బరాజ్‌ను పరిశీలిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదికలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగిస్తారు. బరాజ్ రైతులకు మేలు చేస్తుందా.. నష్టం చేస్తుందా అనే విషయమై ముఖ్య నేతలు క్షుణ్ణంగా వివరిస్తారు. అలాగే హరీశ్‌రావు ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. ఇందుకు సంబంధించి అన్నారం వద్ద వేదిక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు గురువారం పర్యవేక్షించారు. కాగా భూపాలపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ బృందం సుమారు వెయ్యి మందికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గురువారం బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలందరికి భోజనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నారం నుంచి తిరుగు ప్రయాణంలో పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాత్రి డిన్నర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 29: కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద కుంగిన పిల్లర్లను అధికార కాంగ్రెస్ పార్టీ తప్పుగా చూపించి కాలయాపన చేయకుండా వెంటనే నీళ్లు లిఫ్ట్ చేసి పంటలకు సాగు నీరందించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మహేశ్‌బాబుకు గురువారం భూపాలపల్లి మండలంలోని రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దశాబ్దాలుగా కరువు పీడితులమై దుఃఖించిన మా ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కల్పతరువుగా మారిందన్నారు. బీడు భూములన్నీ కొంతకాలంగా కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారాయని పేర్కొన్నారు. కానీ ఇటీవల దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్‌లోని మూడు పిల్లర్లకు పగుళ్లు రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ దానిని తప్పుగా చూపిస్తూ కాలయాపన చేస్తున్నందున పంటలకు నీరందక ఎండిపోతున్నాయన్నారు. వెంటనే పిల్లర్లకు మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేసి పంటలకు అందించాలని వారు కోరారు.