బీఆర్ఎస్ ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. ఆదివారం అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో సభ అదుర్స్ అనగా.. కొల్లాపూర్, కల్వకుర్తిలో కోలాహలం నెలకొనగా.. నాగర్‌కర్నూల్‌లో నీరా‘జనం’ పలికారు. గులాబీ దళపతికి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు.
వేలాదిగా తరలొచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ నేతలతో సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. నాలుగు ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు రెపరెపలాడాయి. ఊరూ వాడా వాహనాల్లో భారీగా తరలిరావడంతో జన సునామీని తలపించాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూసి తర్వాత ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు పలికారు. అధినేత ప్రసంగిస్తుండగా.. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినదించారు. సీఎం తిరిగి వెళ్తుండగా.. ప్రజలు బారికేడ్లను దాటుకొని కాన్వాయ్ వెంట హెలిపాడ్ వద్దకు పరుగుల తీశారు. హెలికాప్టర్ గాల్లోకి లేవగానే జననేతకు చేతులు ఊపి జై కేసీఆర్ అంటూ టాటా చెప్పారు.
సమావేశాలు విజయవంతం కావడంతో గులాబీ పార్టీశ్రేణుల్లో జోష్ నెలకొన్నది. అభ్యర్థులు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, విజయుడుకి మద్దతు వెల్లువెత్తింది. కళాకారులు మధుప్రియ, ఏపూరి సోమన్న, ప్రసాద్, మిట్టపల్లి సురేందర్, సంధ్య, లక్ష్మక్క ఆటాపాట ఆకట్టుకున్నాయి.