అలంపూర్, జనవరి 23 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన తారాస్థాయికి చేరుకుందని వారికి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు, తర్వాత దేవుళ్ల సాక్షిగా మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయుకుండా ప్రస్తుతం గ్రామసభల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ ఏ పథకమైనా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని ఏ హోదాలో అధికారులకు చెబుతున్నారని ప్రశ్నించారు. చాలాచోట్లా గ్రామసభల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే గ్రామసభలో వేదికపై కూర్చుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని, జ నాభా గణన చేశారు, మళ్లీ ఇప్పుడు వేదికల మీద అర్హులకు న్యాయం చేస్తామని దరఖాస్తులు సేకరిస్తు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది దాటినా నేటికీ గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని గుర్తు చేశారు. గ్రామాలు చెత్తాచెదారంతో నిండిపోయాయని పారిశుధ్య చర్యలు చేపట్టే దిక్కులేదన్నారు.
సంక్షేమ పథకాలు అందక ప్రజలు గోస పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో షీకార్లు కొడుతున్నారని, ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ మీద కేస్లు పెడితే పట్టించుకోని ప్రభుత్వం కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం తగదన్నారు. రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో దొరికిన రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టి చార్జి షీట్ వేయాలన్నారు. ధరణిలో లొసుగుల పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూమాత పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజ లు ముందుకు వచ్చి గ్రామసభలు నిర్వహించాలన్నా రు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. గ్రామసభల్లో అధికారులను నిలదీసే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు. గ్రామాల అభివృద్ధికి సంవత్సర కాలంలో ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. సమావేశంలో అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, బీఆర్ఎస్ నాయకులు కిశోర్, రవి ప్రకాష్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి, నరేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి, మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్‌చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.