మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం.. ఊహించిన దానికంటే వరంగల్ సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా చాలా తక్కువ మందిని తరలించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించినా.. అందుకు భి న్నంగా స్వచ్ఛందంగా సొంత వాహనాల్లో తరలివెళ్లారు. వరంగల్ సభకు వెళ్లి తిరిగి వచ్చేవరకు అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో టచ్‌లో ఉన్నా రు.
సోమవారం తెల్లవారుజామున గమ్యస్థానానికి చేరా రు. సభ ముగిశాక అందరినీ పార్టీ నేతలు సమన్వయం చేశారు. మక్తల్ మండలంలోని అవుసలోనిపల్లి కార్యకర్తలకు కేటాయించిన ఆర్టీసీ బస్సు మొరాయించడంతో వరంగల్ శివారులో ఆగిపోయింది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హుటాహుటిన అక్కడికెళ్లి వేరే బస్సులో వారిని తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊహించిన దానికంటే ఎక్కువ జనం తరలి వెళ్లడంతో పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోమవారం గ్రామాల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ సభ, సార్ స్పీచ్పైనే చర్చించుకుంటున్నారు.
పార్టీ 25ఏళ్ల పండుగను వరంగల్‌లో నిర్వహిస్తే ఊరూవాడ ఏకమై సభకు ఊహించని జనం తరలివెళ్లారు. అనేక గ్రామాల్లో వాహనాలు పంపించాలని పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. చివరకు చేసేదేమీ లేక చాలామందికి చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలను అరేంజ్ చేయాల్సి వచ్చింది. మరికొంత మంది సొంత వాహనాలను ఏర్పాటు చేసుకొని ముందస్తుగానే వరంగల్‌కు వెళ్లిపోయా రు. కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ వీడియోలు, ఫొటోలు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. వరంగల్ సభకు రావడం జన్మ ధన్యమైందంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు. కేసీఆర్ సభకు వెళ్లాలనే సంకల్పం తప్పా మిగతా ఏదీ కనిపించలేదని కొంతమంది కా మెంట్లు చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి దాదాపు 350 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తెల్లవారుజామున ఇండ్లకు చేరుకున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, మా జీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇతర క్యాడర్ నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి తరలివెళ్లిన వారు సురక్షితంగా ఇండ్లకు వచ్చేవరకు రాత్రంతా జాగరణ చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వచ్చిన కార్యకర్తలు గ్రామాల్లో అక్కడ జరిగిన విశేషాలను వివరించడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ. మరోవైపు టీవీల్లో సెల్ఫోన్లలో కేసీఆర్ స్పీచ్‌ను విన్న జనం రచ్చకట్టల వద్ద జోరుగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తీరును మాట్లాడుకోవడం కనిపించింది.