MLA Vijayudu | అలంపూర్ చౌరస్తా, మార్చి 05 : పేదింటి ఆడపిల్లల వివాహాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలంపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుకగా అందించే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఒకప్పుడు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటేనే ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రారంభించి పేద ప్రజలకు ఆసరాగా నిలిచారని తెలిపారు.
నేడు ఈ పథకాలు వల్ల ఎంతో మంది ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అలంపూరు ఉండవెల్లి, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు చెందిన 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తాసిల్దార్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.