మరికల్, ఏప్రిల్ 01: కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకే భూములను కాజేయాలని చూస్తుందన్నారు. జీవ వైవిద్యానికి నిలయమైన హెచ్సీయూ భూములను ప్రభుత్వం సొంతం చేసుకొని అడవులను నరికివేస్తే జంతుజాలానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ప్రైవేటు కంపెనీలకు భూములు విక్రయించి ఆదాయ వనరులు పొందాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం లాఠీచార్జీ చేయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి పేరుతో భూములను లాక్కోవాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సురిటి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు వీరబసంత్, కొండన్న, హుస్సేన్, పెంటమీద నరసింహులు తదితరులు పాల్గొన్నారు.