కల్వకుర్తి, జూలై 4 : ప్రజాపాలనలో నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లు, కేసులు సహజంగా మారాయి. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు ప్రశ్నించేవారు పోలీసుల చేతిలో బంధీలవుతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని కోర్టులు పదే పదే చెబుతున్నా..పాలకులు మాత్రం నియంతపోకడలు సాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు, సుభాషితాలు చెప్పిన కాం గ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే నిరసనలను సహించలేకపోతున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి నిర్బంధకాండకు తెరలేపారు.
ఊర్కొండ మండలం ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తు న్న క్రమంలో కల్వకుర్తి, ఊర్కొండ, చారకొండ మండలాలకు చెందిన బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు, ఎర్రవల్లి నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శనివారం తెల్లవారుజామునే పోలీసులు సదరు నేతల ఇండ్ల వద్దకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. వీరు చేసిన నేరం ఏమిటంటే ప్రజల పక్షాన నిరసన తెలపడం, ప్రశ్నించడం. ప్రశ్నించే వాళ్లంటే ప్రభుత్వానికి గిట్టదు. అందుకే సీఎం పర్యటనలో ప్రజాసమస్యలను ప్రశ్నిస్తారనే భయంతో ముందస్తుగానే అరెస్ట్ చేశారు.
ఊర్కొండపేట మాజీ సర్పంచ్‌తోపాటు కార్మిక సంఘం నాయకుడు, కల్వకుర్తి సీపీఐ, సీపీఎం నాయకులను, కొన్ని రోజలుగా న్యాయం చేయాలని దీక్షలు చేస్తున్న ఎర్రవల్లి రిజర్వాయర్ నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజాపాలనలో ప్రజలే పాలకులని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు ఎందుకు నిర్బంధకాండకు తెరలేపుతున్నారని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కు, నిరసనలో న్యాయం ఉంటే పరిష్కరించి ప్రజల మెప్పు పొందాలి కాని, నిరసనలు చేస్తున్న వారిపై నిర్బంధం విధించడం దుర్మార్గమని ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు. ఇదేమి ప్రజాపాలన అంటూ నోసళ్లు విరుస్తున్నారు. నియంతపోకడలతో పాలన సాగించిన పాలకులెందరో చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ప్రజాస్వామిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.