నాగర్‌ర్నూల్, జూన్ 5 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో.. ఎక్కడ అడ్డుకుంటారేమోనని రెండోరోజూ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. గురువారం పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయడం.. కొందరిని అదుపులోకి తీసుకోగా.. శుక్రవారం కందనూలు జిల్లాలోని గులాబీ పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొన్నది. పలువురు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా మినీ వ్యాన్‌తో వచ్చారు.
ఈ క్రమంలో నాయకులకు, పోలీసుల మధ్య వా గ్వాదం చోటు చేసుకున్నది. బలవంతంగా అరెస్టు చే యడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చివరకు 30 మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు కాకుండా 10 కి.మీ. దూరంలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో ఉంచారు. అక్రమంగా నిర్బంధించడంపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. అలాగే తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి మండలాల్లోని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల నాయకులు 100 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తిమ్మాజిపేటలో నిరసన చేపట్టి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో 90 శాతం పనులు పూర్తి చేసిన పీఆర్ఎల్ఐనిపూర్తి చేసి రైతులకు నీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యల గురించి నిలదీస్తారనే ప్రశ్నించే గొంతుకలను నొక్కే ందుకు పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పర్యటనతో సరిపెడితే ఊరుకునేది లేదని.. వెంటనే ప్రాజెక్టును ఎప్పు డు పూర్తి చేస్తారో? ఈ ప్రాంత ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
సొంత గడ్డ అని చెప్పుకునే సీఎం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టులో మిగిలిన పనులు చేపట్టాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టి ప్రాజెక్టులపై చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పడంతో రేవంత్ సర్కారులో కదలిక వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారని చెప్పారు. పర్యటనలో రైతుల సమస్యలను ఎక్కడ ప్రశ్నిస్తామోనన్న భయంతో ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారని వారు ఆరోపించారు.