మహబూబ్‌నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సర్కారు కావాలని నిర్లక్ష్యం చేస్తుందని దీనిపై రైతులను ప్రజలను ఏకం చేసి భారీ ఉద్యమాన్ని చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యే కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జడ్చర్ల మండలం ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90శాతం పూర్తి చేస్తే కేవలం 10శాతం కాల్వ పనులు చేపడితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలమయ్యేదని కావాలని దీని కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెట్టిందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను జాగృతం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంత పని జరిగిందో.. ప్రజలకు వివరించేందుకు ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిండుకుండలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రూ.27వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్ పంప్ హౌస్‌లను కూడా పూర్తిచేసి బాహుబలి పంపులను బిగించామని, డ్రై రన్, ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. 2023 అక్టోబర్‌లో కేసీఆర్ ఈ ఎత్తిపోతల పథకానికి ప్రారంభించి కృష్ణానది జలాలను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపించారన్నారు.
అప్పుడే కేవలం రెండు, మూడు రోజుల్లోనే రెండు టీఎంసీల నీటిని తోడి రిజర్వాయర్‌లోకి నింపామన్నారు. పాలమూరు ప్రజల కల సహకారమవుతున్న వేళ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ఓటేశారన్నారు. కేవలం రిజర్వాయర్ల నుంచి రిజర్వాయర్ వరకు కాల్వలు తవ్వితే ఈ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామన్నారు. అంతేకాకుండా రైతు సమస్యలపై కూడా పాదయాత్రలో సర్కారును నిలదీసి భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉండి కూడా ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందని అక్కస్సుతో ప్రాజెక్టును పడావు పెట్టారని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆరోపించారు. జూన్‌లో పాదయాత్రలు ఎప్పుడు ప్రారంభించాలో పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి నిర్ణయిస్తామన్నారు. నార్లాపూర్‌లో ప్రారంభమయ్యే పాదయాత్రకు కేటీఆర్ హాజరవుతారని.. ముగింపు సభకు కేసీఆర్‌ను రప్పిస్తామన్నారు. త్వరలో మరోసారి ఉమ్మడి జిల్లా నేతలంతా భేటీ అయి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు ఇస్తే వలసలు తగ్గుతాయని భావించి ఆనాడు కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి 90శాతం పనులు పూర్తి చేసారు.. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. పది శాతం పనులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు పెరిగిపోవడమే కాకుండా ఒక జలభాండాగారంగా కనిపించేది.. రిజర్వాయర్లు పూర్తి చేశాం.. పంప్ హౌస్‌లు పూర్తి చేశాం.. కాల్వలు తవ్వి మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి..
కానీ ఇప్పటికీ ఆన్ చేయడం లేదు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వం మెడలు వంచుతాం. కేసీఆర్‌ని కలిసి పాదయాత్రపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం. జూన్ నెలలోనే పాదయాత్ర ఉంటుంది. రైతులను.. ఉమ్మడి జిల్లా ప్రజలను ఏకం చేస్తాం. వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే లీడర్ల కొనుగోలు పెడుతున్నారు. ఇష్టం ఉన్నట్టు తరుగు తీస్తున్నారు. వడ్లు తరలించేందుకు లారీలు లేవు.. సంచులు లేవు. ప్రభుత్వంపై రైతులు తిరగబడే రోజు వస్తుంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వానికి టైమ్ ఇద్దామని ఇన్ని రోజులు ఆగినం. పాలమూరు ప్రాజెక్టుపై కనీసం ముఖ్యమంత్రి కూడా సమీక్ష చేయలేదు. అత్యంత ప్రాధాన్యత అంశంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తారని అనుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరులో చేపట్టినం..ఎన్ని అడ్డంకులు వచ్చినా పాలమూరు ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తి చేశాం.. మా ప్రభుత్వం వస్త్తే ఆరు నెలల్లో కరివెన వరకు నీళ్లు తీసుకొచ్చే వాళ్లం. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు పడావు పెట్టారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా వీలైతే కేసీఆర్‌ని కూడా తీసుకురావాలనీ తేదీలు, కార్యాచరణ ప్రకటిస్తాం. యాసంగి కొ నుగోలు స్టార్ట్ అయ్యాక ఇన్ని రోజులకు నిన్న రివ్యూ చేశారు. కాంగ్రెస్ ఆలోచన విధానం కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలనుకుంటుంది. గన్నీ బ్యాగులు లేవు, లారీలు, గోదాంలు లేవు, హమాలీలు లేరు.
పంట పండించడానికి మూడునెలలు అయితే.. అమ్ముకోవడానికి కూడా మూడునెలలు పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ రైతులకు అండగా నిలిచింది. కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతాం. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్‌రెడ్డి, సురభివాణీ దేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఆంజనేయ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఇంతియాజ్, వాల్యానాయ క్, గద్వాల పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయు డు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే జిల్లాకు ఏమైనా చేస్తారని ఎక్కువ మంది ఓట్లు వేశారు.. కానీ ఇప్పుడు పశ్చాతాపం పడుతున్నా రు. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించి పనులు పూర్తి చేసేందుకు పాలకులు దృష్టి పెట్టాలి. కావాలనే సర్కారు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్లీ అదే కాలేశ్వరం దిక్కైంది. వచ్చిన వెంటనే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే రైతులకు ప్రయోజనం కలిగేది. ఈ ఎత్తిపోతల ద్వారా వట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రణాళిక ఉంది. దీనిని కాదని రూ.1800కోట్లతో ఏదుల నుంచి డిండికి లింక్ ఇచ్చేందుకు సర్కారు టెండర్లు పిలిచింది. ఇది రైతులను మోసం చేయడమే కాక భారీఎత్తున ప్రజాధనం దోచుకునేందుకు ఇలా చే స్తున్నారు.
జిల్లా మంత్రులకు ప్రాజెక్ట్‌లపై అవగాహన లేదు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మాట్లాడుతున్న సదరు మంత్రి ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విషయం మరిచిపోతున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదనంగా సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ పూర్తి చేశారా సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్ట్‌లపై సీఎం సమీక్షా చేయాలి.. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. వడ్లు తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ టెండర్లను పిలిచారు.. కానీ టెండర్లు వేసిన వారి వద్ద వాహనాలు లేవు. 40 కేజీల వడ్ల బస్తాకు 4కేజీల తరుగు తీస్తుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. అక్రమ కేసులు.. ఇసుక దందా.. ఇతర పార్టీ నాయకులను తగ్గించి మాట్లాడటం జిల్లా మంత్రులకు అలవాటు అయ్యింది.