రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడో రోజు ఆందోళనలో భాగంగా గురువారం విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట గులాబీ శ్రేణులు ధర్నాలు చేపట్టాయి. ఊరూరా నిరసన ర్యాలీలు, శవయాత్రలు నిర్వహించారు. రేవంత్ దిష్టిబొమ్మలను ఊరేగించి, చెప్పులతో కొట్టి దహనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్‌ను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సారథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. రైతులంటే గౌరవంలేని ఆయన వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే మండల, పట్టణ, మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నాయకులతో కలిసి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
– మహబూబ్‌నగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, జూలై 13( నమస్తే తెలంగాణ ప్రతినిథి ) : వ్యవసాయానికి మూడుగంటలు విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరే కిస్తూ గురువారం నిరసనల పర్వం కొనసాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గకేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. జిల్లా కేంద్రాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లు, కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో విద్యుత్ స బ్ స్టేషన్ వద్ద రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అం టూ నినాదాలు చేశారు. నిన్న ధరణిని బంగాళఖాతం లో పడేస్తామని.. ఈ రోజు ఉచిత విద్యుత్ ఎందుకని, రేపు రైతుబంధు, దళితబంధు ఎందుకని మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీ నివాస్‌గౌడ్, దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అ చ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధర్నాల్లో పాల్గొన్నారు. అచ్చంపేటలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, శవయాత్ర నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు రేవంత్‌రెడ్డి మాటలే నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మూడుగంటల కరెంటు ఇస్తే గతంలో పడిన గోసలే మళ్లీ పడాల్సి వస్తుందన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధుతో రైతులు ప్రశాంతంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి
అచ్చంపేట, జూలై 13 : వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తు అవసరం లేదని, 3గంటలు చాలని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కందనూలు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేట నియోజకవర్గవ్యాప్తంగా సబ్స్టేషన్ల ఎదుట గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలోని సబ్‌స్టేషన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి గువ్వల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు మూడు గంటల కరెంటు ఇవ్వాలంటున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పి.. ఆ తర్వాతే బయట తిరగాలన్నారు. వ్యవసాయ రంగానికి 3గంటల కరెంటు చాలంటున్న రేవంత్‌రెడ్డిని ఊరి పోలిమేరల దాకా తరమికొట్టాలని పిలుపునిచ్చారు. 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని, అర్ధరాత్రి మోటర్లు ఆన్ చేయడానికి వెళ్లి పాముకాట్లు, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలకు గురయ్యారన్నారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయమే తెలియదని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన అమెరికాలో బయటపెట్టారని ధ్వజమెత్తారు. రైతులు మూడు పంటలు పండించుకొని సంతోషంగా ఉంటే వారి కండ్లు మండుతున్నాయని మండిపడ్డారు. రైతులను అవమానించిన రేవంత్‌ను రైతులు చెప్పులతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కరెంట్ అడిగిన పాపానికి రైతులపై అప్పటి సీఎం చంద్రబాబు కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారని.. ఆయన శిష్యుడు రేవంత్ కూడా ఉచిత కరెంట్ వద్దంటున్నారని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏమి చేయలేదని విమర్శించారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ 24గంటల విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తూ.. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తుంటే జీర్ణించుకోలేని రేవంత్‌రెడ్డి తన అక్కసును వెళ్లగక్కాడన్నారు. రైతాంగానికి రేవంత్ కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను అవమానించి ఆందోళనకు గురిచేసిన రేవంత్‌రెడ్డి గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రైతులు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. అనంతరం సబ్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్వహించి అమర్ రహే రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ మంత్రియానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, పీఏసీసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతు పక్షపాతి ‘బీఆర్ఎస్’
కొల్లాపూర్, జూలై 13 : తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కొల్లాపూర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ జంబులయ్య అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడారు. సమైక్య పాలనలో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదన్నారు. బోర్లు, బావులు, కాలువలపై మోటర్లు పెట్టుకొని పంటలను సాగు చేస్తున్న పరిస్థితిని గమనించి కేసీఆర్ సీఎం అయ్యాక 24గంటలు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు. రైతు ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలన్న ఉద్దేశంతో దేశంలో మరెక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇదంతా జీర్ణించుకోలేని రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని.. ఆ నాయకులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతును కండ్లల్లో పెట్టుకుని చూసుకునే కేసీఆర్ లాంటి పాలకులే కావాలని సబ్బండ వర్ణాల ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ధర్నాలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మతీన్ అహ్మద్, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ సోమనాథ్నాయక్, మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ వైస్‌చైర్మన్ జాఫర్, మాజీ జెడ్పీటీసీ రాంమూర్తినాయుడు, మండల, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు రామచందర్‌యాదవ్, పరశురాంగౌడ్, సింగిల్‌విండో చైర్మన్లు కృష్ణయ్య, శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ప్రజలే గుణపాఠం చెప్తారు
జడ్చర్ల టౌన్, జూలై 13 : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చేతులేత్తిసిందనడానికి టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రైతాంగానికి 3 గంటలు కరెంటు ఇస్తే చాలన్న రేవంత్‌రెడ్డి మాటలను ఖండిస్తూ గురువారం జడ్చర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జడ్చర్ల విద్యుత్తు ఏడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటదన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి ఆదుకుంటున్నారన్నారు. నాడు వ్యవసాయం దండగ అంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో నేడు పండుగలా అయ్యిందన్నారు. రైతాంగం బాగుంటే కాంగ్రెస్ నాయకులు చూడలేక, పాతరోజులే తేవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు 3 గంటలు కరెంటు ఇస్తే చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానమేనన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారం, పదవుల కోసమే పాకులాడుతారని.. ప్రజలు, రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, బాదేపల్లి సింగిల్‌విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మిడ్జిల్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, జడ్చర్ల, రాజాపూర్ బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు రఘుపతిరెడ్డి, శ్రీశైలం, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ దానిష్, మాజీ చైర్మన్ మురళి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక పార్టీలను భూస్థాపితం చేయాలి
దేవరకద్ర, జూలై 13 : రైతు వ్యతిరేక పార్టీలను ప్రజ లు తరికొట్టాలని.. కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకద్రలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతొమ్మిదేం
డ్లల్లో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎ న్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిందన్నారు. ఇ ది జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదనడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాం గెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని, రై తులకు 3 గంటల కరెంట్ ఇస్తామని చెబుతున్న రే వంత్రెడ్డిని ప్రజలు తరిమికొట్టాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఏనాడూ రైతులకు మూ డుగంటల విద్యుత్ ఇచ్చిన చరిత్ర లేదన్నారు. రేవంత్‌రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. సరైన సమయంలో రైతుబంధు వే స్తుండడంతో అన్నదాతలు సంతోషంగా సాగు పను లు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చూడలేకపోతున్నారన్నారు. ఇవ్వని హామీలను కూడా ముఖ్యమం త్రి కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పొల్గొన్నారు.
కర్షకులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి
మరికల్, జూలై 13 : రైతులను కించపర్చినట్లు మాట్లాడిన టీపీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి బేషరుతుగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు రైతులంటే గిట్టదని.. రైతును రాజు చేయడమే బీఆర్ఎస్ ధ్యేయమన్నారు. రేవంత్‌కు రైతులే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రైతుల ఊసురు తగిలి కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుందని విమర్శించారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, వైస్‌ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీ గోపాల్, నాయకులు కృష్ణారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.