గద్వాల అర్బన్, ఆగస్ట్టు 5 : రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాసు హన్మంతునాయుడు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతులు కర్నూల్‌కు దగ్గరగా ఉన్నందున 30ఏండ్ల నుంచి ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పంట రుణమాఫీ చేసినప్పుడు కూడా రైతులకు వివిధ బ్యాంకుల్లో రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. అందుకే కర్నూల్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లెపాడు శంకర్‌రెడ్డి, ఆత్మలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, బస్వరాజ్, శ్రీరాములు, కురుమ పల్లయ్య, చందు తదితరులు ఉన్నారు.