మహబూబ్‌నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఒకవైపు బెదిరింపులు మరోవైపు ప్రలోభాలు.. ఇంకోవైపు బీఆర్ఎస్ గెలిస్తే నిధులు ఇవ్వమని అల్టిమేటాలు.. పో లీస్ యంత్రాంగంతో బయటికి రాకుండా కట్టడీలు.. పోలింగ్ బూత్‌ల వద్ద నుంచి తరిమి నా ఉమ్మడి పాలమూరు జిల్లా కేసీఆర్‌కే జై కొ ట్టింది. చివరి విడుత ఎన్నికల్లో కారు టాప్ గేర్‌లో దూసుకుపోయింది. మంత్రి నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్ట పోయింది.. తన సొం త ఊర్లో ఓడిపోయానని.. బీఆర్ఎస్ నేత ఊళ్లో గెలవకుం డా చేస్తానని శవతం చేసిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం ఎదురైంది.
మరోవైపు ఒకటి రెండు ఓట్ల తే డా వచ్చినా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నది. రెండో విడుతలు ఇదే రకంగా నారాయణపేట జిల్లాలో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ గెలుస్తే కాంగ్రెస్ ఖాతాలో కలుపుకున్నారు. ఫైనల్ విడుతలో కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు చోట్ల కాంగ్రెస్ ఇదే రకమైన ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక మక్తల్ నియోజకవర్గంలో మంత్రి శ్రీహరికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించారు.
బీఆర్ఎస్తో అటు బీజేపీతో పోటీ ఎదుర్కోలేక చేతులెత్తేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మంత్రాంగం మరోసారి ఫలించింది. జడ్చర్ల బాలానగర్‌లో ఏకంగా 30 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సత్తా చాటారు. సమిష్టి కృషితో బీఆర్ఎస్ ఫైనల్లో కాంగ్రెస్‌ను గట్టిగా ఢీ కొట్టింది. ఏకంగా 174 స్థానాలను కైవసం చేసుకున్నారు.
అన్నిచోట్లా హోరా హోరీగా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకునేందుకు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని పోలీసు ఒక రోజు ముందు నుంచే పోలీసు యంత్రాంగాన్ని గ్రామాల్లోకి దింపి భయభ్రాంతులకు గురి చేశారు. చాలాచోట్లా ఓటమిని జీర్ణించుకోలేక అడ్డదారులు తొక్కారు. అయినప్పటికీ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఓటర్లు బీఆర్ ఏస్ మద్దతుదారులకే పట్టం కట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 50 స్థానాలు వనపర్తిలో 26, గద్వాలలో 33, నాగర్‌కర్నూల్ 39, నారాయణపేటలో 26 పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
జడ్చర్లలో మరోసారి దూసుకుపోయిన కారు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఏకంగా 30 సర్పంచి స్థానాలను కైవసం చేసుకుంది. నియోజకవర్గానికి కేంద్ర బిందువైన జడ్చర్లతో పాటు బాలానగర్ మండల కేంద్రాల్లో ఊహించని రీతిలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులు గెలిపిస్తే నిధులు ఇవ్వనని.. అల్టిమేట్ ఇచ్చిన కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు అనూహ్య విజయం సాధించింది. ఊహించని రీతిలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గంలో 188 పంచాయతీ స్థా నాలు ఉండగా బీఆర్ఎస్ ఏకంగా 85 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 84 స్థానాలకే పరిమితమైంది. 14 చోట్లా స్వంత్రంత్రులు గెలువగా ఐదు చోట్లా బీజేపీ మద్దతుదారులు గెలిచారు. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకోవడంతో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సఫలీకృతం అయ్యారు.
మక్తల్‌లో మంత్రికి షాక్..
మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరికి బీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఏకంగా 26 స్థానాలను దక్కించుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కారు జోరు కనిపించింది. మరోవైపు బీజేపీ కూడా ఊహించని విధంగా గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. ఫలితాలు వెలువడుతున్నంతసేపు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉండి నాయకులు అధికారులపై చిందులు తొక్కినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సత్తా చాటడంతో సొంత మండలంలోని మంత్రికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చాలామంది కాంగ్రెస్ నాయకుల కంచుకోటలను బద్ధలు కొట్టారు.
నల్లమల్లపై మర్రి మార్క్..
ఒకవైపు సీఎం సొంత గ్రామం ఉన్న నియోజకవర్గ కావడంతో కాంగ్రె స్ నేతలు అచ్చంపేటపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికార యం త్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కూలింగ్‌కి రెండు రోజుల ముందు నుంచి కాంగ్రెస్ నేతలకు ప్రచారం చేసుకునే వెసులుబాటు ఇచ్చి బీఆర్ఎస్ నేతలపై నిఘా పెంచారు. గ్రామాల్లో ప్రచారం చేయకుండా చేయడంతో పాటు చాలామంది నేతలకు బెదిరింపులకు గురి చేశారు. అయి నా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రంగంలో దిగి నల్లమలలో తనదైన శైలిలో దూసుకుపోయా రు. సీఎం సొంతూరు సమీపంలోని మేజర్ పంచాయతీని ఏకంగా 561 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. రెండో విడుతలో సొ ంత మండల కేంద్రాన్ని కైవసం చేసుకున్న ఘటన మరువకముందే పక్క మండలాన్నీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. చాలా చోట్ల ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ కొర్రీలకు లొంగిన ప్రజలు ఊహించని తీ ర్పు ఇచ్చారు. నల్లమలలో బీఆర్ఎస్కు 39 స్థానాలు కట్టబెట్టారు.
అలంపూర్‌లో చల్లదే విజయం..
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో తుది విడుత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ 33 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంలో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కీలకపాత్ర పో షించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు అడ్డుకట్ట వేసి బీఆర్ఎస్ మద్దతు దారులను గెలిపించుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఊహించని రీతిలో కారు దూసుకుపోవడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు.
వనపర్తి జిల్లాలో కారుకే పట్టం
వనపర్తి జిల్లాలో కూడా కారు జోరు కనిపించింది. చివరి విడత ఎన్నికల్లో ఏకంగా 26 స్థానాలను దక్కించుకుంది. అడ్డదారుల్లో కాంగ్రెస్ నేతలు గెలిచేందుకు నానా అపసోపాలు పడ్డారు. వీపనగండ్ల మ ండలం కల్వరాల గ్రామంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా బీఆర్ఎ స్ ఆదిత్యంలో ఉంది.. ఈ లోపు కరెంటు పోవడంతో కొద్దిసేపు లెక్కింపును నిలిపివేశారు. ఏమైందో ఏమో కానీ అంతలోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడంతో గ్రామస్తులు అంతా లెక్కింపు కేంద్రం వద్ద బైఠాయించారు. సిబ్బందిని బయటికి రానీయకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు సత్తా చాటడంతో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నారు.
