తెలంగాణలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయ్.. దీంతో సాగుకు నిరంతర విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని ప్రకటనలు చేస్తున్నది. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వొద్దు.. నీ కరెంటొద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న
కేసీఆర్ ప్రభుత్వానికే మా మద్దతంటూ ప్రకటిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటుతో నాలాంటి మహిళలు కూడా వ్యవసాయం చేసుకునే సౌలత్ ఉంది. ఉదయం పూట చేను కాడికి పోయి పొలం పనులు చేసుకుంటూనే.. మోటర్ ఆన్‌చేసి నీళ్లు పారబెట్టుకుంటున్నాం. కానీ కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ చాలంటున్నారు. మూడు గంటలు కూడా ఇస్తరో లేదో తెలియదు. ఒకవేళ ఇచ్చినా రాత్రికి ఇస్తరో, పగలు ఇస్తరో.. రాత్రి పూట ఇడిస్తే మహిళలు బావుల వద్దకు వెళ్లి నీళ్లు పారించుకునే అవకాశం ఉండదు. భూమిని నమ్ముకున్నోళ్లకంతా నష్టం జరుగుతుంది. మళ్లీ వ్యవసాయ భూములన్నీ బీడుపడుతాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పిన మూడుగంటల కరెంటిస్తే రైతులంతా ఆత్మహత్య చేసుకునుడు ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. విద్యుత్ సరఫరా ఆగిపోయి పంటలకు నీరు అందక ఎండిపోయేవి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక పదేండ్లలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డెక్కిన ఘటనలు ఒక్కటి కూడా లేవు. నేడు మోటర్లకు నిరంతరం కరెంట్ ఇస్తున్నరు. కాంగ్రెస్ నాయకుల గారడి మాటలు రైతులు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటే మాకు చాలు. పంట సాగుకు రైతుబంధు కూడా ఇస్తున్నడు. మేము కేసీఆర్‌కే ఓటు వేస్తం. అందరికీ మంచి చేస్తున్న కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం.
తెలంగాణలో 24 గంటల కరెంట్ వద్దని.. మూడు గంటలు సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పడం చాలా విచిత్రంగా ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు గంటల కరెంట్ ఇస్తే పొలాలకు సరైన నీళ్లందక రైతులు వ్యవసాయం ఇడిసిపెట్టి మళ్లీ పట్నం, పూనా, బొంబాయికి వలస బాట పట్టాల్సి వస్తది. వలసలు వెళ్లిన చాలా మంది ప్రస్తుతం తిరిగి వచ్చి ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల వారు మన వద్దకు వ్యవసాయ కూలీలుగా వలసలు వచ్చి బతుకుతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే రైతులు ఆగమైతరు. మన పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, మాలాగా మీరు ఇబ్బందులకు గురికావొద్దని మా బంధువులు చెబుతున్నారు. అక్కడ అమలు చేయని హామీలు మన వద్ద అమలు చేస్తామంటే నమ్ముదామా..? మోసపూరిత మాటలు చెప్పడం కాంగ్రెసోళ్ల నైజం. రైతులు 24 గంటల కరెంట్ అందించే సీఎం కేసీఆర్ వెంటే ఉండి రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రైతుల మేలుకోరె సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏనాడూ కంటి నిండ నిద్రపోలేదు. రాత్రంతా జాగరం చేసేటోళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ హయాంలో మా బాధలు తీరాయి. 24 గంటల కరెంట్ ఉండడంతో ఎప్పుడంటే అప్పుడు పోయి నీళ్లు పారబెట్టుకుంటున్నాం. కాంగ్రెసోళ్లేమో ఇప్పుడు మూడు గంటల కరెంట్ చాలంటున్నారు. ఎట్ల సరిపోతది. ఆ కరెంట్‌తో మొదటి మడి కూడా పారదు. ఇంకా 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అంత పెద్ద మోటర్ కొనాలంటే మా వద్ద పైసలు కూడా లేవు. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ పాత కథే అవుతది. కాంగ్రెసోళ్లకు వ్యవసాయం గురించి ఏం తెలువదని అర్థమైంది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాల్సి వస్తే భూములు ఎడారిగా మారడం ఖాయం. కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ మోటర్ల వద్ద పడిగాపులు తప్పవు. అవగాహన లేని కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పాలన మంచిది. నిరంతరం ఉచిత కరెంట్ ఇచ్చి బీడు భూములను సాగులోకి తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికే రైతులు మద్దతు ఉంటుంది. మాకు 3 గంటల కరెంట్ వద్దు.. 24 గంటల కరెంటే కావాలి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24గంటల కరెంటు పోతది. మిణుకు, మిణుకుమంటూ 3గంటల కరెంటే దిక్కైతది. మన బతుకులు ఆగమైతవి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు, నాలుగు గంటల కరెంటు ఉండడంతో ఒక్క మడి కూడా నీళ్లు పారేది కాదు. నాకున్న మూడెకరాల్లో అరఎకరం మాత్రమే సాగు చేసేవాడిని. అది కూడా పండేది కాదు. అష్టకష్టాలు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన 24గంటల కరెంటుతో మా జీవితాలు మారిపోయినయి. 24గంటల కరెంటు ఇవ్వడం, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేయడంతో ఉన్న మూడెకరాలతోపాటు పక్కనే ఉన్న వారి పొలాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా. అప్పట్లో 50బస్తాల ధాన్యం కూడా పండేవి కాదు. ఇప్పుడు ఏకంగా 600 బస్తాల ధాన్యం పండిస్తున్నా. మా పొలంలో భూగర్భజలాలు పెరగడంతో బోరులో పుష్కలంగా నీళ్లు వచ్చినయ్. 24గంటల కరెంటుతో ఇప్పడు పుష్కలంగా ఏడాదికి రెండు పంటలు పండుతున్నయి. వరితోపాటు కూరగాయలు కూడా సాగు చేస్తున్నా. ఇప్పుడు మూడెకరాలు సాగు చేస్తుండటంతో ప్రతి పంటకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. కర్ణాటకలో 24గంటల కరెంటు ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని..కేవలం 3గంటల కరెంటు మాత్రమే ఇస్తుంది. అక్కడ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థతులు నెలకొన్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే అలాంటి పరిస్థితులే ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ గమనించి మళ్లీ రైతుల మేలుకోరే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.