మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల టౌన్, జూన్ 30 : రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా..సొంత జిల్లాకు ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చావా..? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భాగంగా ఎకరా భూమి అయినా సేకరించవా అం టూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నిలదీశారు. జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన కార్యక్రమం మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తుంగభద్ర నది మీద శ్రీశైలానికి నీళ్లు రాకుండా 65టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు డ్యాంలు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతూ , తుంగభద్ర, కృష్ణానదులపై అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేవంత్‌రెడ్డి నోరు మూసుకున్నాడని ఆరోపించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు.
కల్వకుర్తిలో 3లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, నెట్టెంపాడుకు లక్షా 60వేల ఎకరాలకు , భీమాలో లక్షా 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి పాలయూరు జిల్లాలో చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చామని హరీశ్ అన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అ యి ఉండి ఈ జిల్లాకు ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకైనా సాగునీరు ఇచ్చి ఉంటే చూపించాలని సవాల్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదని, ఫీజులు కట్టక పిల్లల సర్టిఫికెట్లు కాలేజీ యజమాన్యాలు ఇవ్వకపోవడంతో వాళ్ల చదువులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా రేవంత్‌రెడ్డి మోసం చేయని వర్గమే లేదన్నారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ రూ.2000లకు పెంచితే ఎన్నికల ముందు రూ. 4000 ఇస్తానన్న రేవంత్‌రెడ్డి రూపాయి పెంచలేదని, కొత్త పింఛన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డలంటే స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలని, కానీ రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడని మండిపడ్డారు.
కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదని, 11విడుతల్లో కేసీఆర్ రూ.73వేల కోట్ల పెట్టుబడి అందజేస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక ఐదు విడుతల్లో మూడు విడుతలు ఎగ్గొట్టాడన్నారు. మూడు పంటలకు మూ డు సార్లు రైతుబంధు ఇవ్వాలన్నా రేవంత్ ఇప్పటికే మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టాడని గుర్తు చేశారు. రైతులకు ఎగ్గొట్టిన రూ.29వేల కోట్ల డబ్బులు ఎప్పుడు ఇస్తావు రేవంత్ అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 2021-2022 లో 92లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని, దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత.? అని ప్రశ్నించారు.
కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయతీలను చేస్తానన్నాడు చేసి చూపించాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని.. ఎమ్మెల్యే పదవీని సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మారెడ్డి అని కొనియాడారు. 2009లో కూటమిలో భాగంగా లక్ష్మారెడ్డికి టికెట్ రాకపోయినా పార్టీకోసం నిబద్ధతతో పనిచేసి కేసీఆర్‌ని ఎంపీగా గెలిపించడానికి కృషిచేసిన నిజాయితీ గల నాయకుడు లక్ష్మారెడ్డి అని కొనియాడారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే ‘నవ్వి పోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది’ అని ఆయన తీరుని ఎండకట్టారు.
పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందన్నారూ. ప్రతి కార్యకార్త ఒక సైనికుడిలా పోరాడాలని, ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంలపై , తప్పిన హామీలపై చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో నరేందర్‌రెడ్డి చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజ్‌గిరిలో 5000 ఓట్లతో గెలిచావ్.. మళ్లా నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయమని, పాలమూరులో 14 సీట్లకు గానూ 14గెలిచి తీరుతామని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
బీఆర్ఎస్ను టచ్ చేయలేరు : శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన మూడేళ్లలో అన్ని వ ర్గాల వాళ్లకు ఎన్ని ఇబ్బందు లు పెట్టినా భరిస్తూ ఉన్నార ని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను టచ్ చేసి దమ్ము ఎవరికీ లేదని, మంత్రులుగా పనిచేసిన వా ళ్లు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు పార్టీ మారారని వాళ్లంతా బాధ్యత లేని వాళ్లని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉన్నోళ్లంతా నికార్సైన బాధ్యత కలిగిన కార్యకర్తలు, నాయకులు మిగిలారన్నారు. వంద శాతం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యమంలో పాల్గొనని వాళ్లను కూడా అక్కున చేర్చుకుంటే వాళ్లంతా మళ్లీ పార్టీ మారి వెళ్లిపోయారని, దొంగలు ఎప్పటికైనా దొంగలే అన్నారు. మళ్లీ మూడోసారి సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమన్నారు. బీఆర్ఎస్ నాయకులు సభ్యత్వ నమోదుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఉద్యోగ సమయంలోనే జైళ్లకు వెళ్లి వచ్చామని గుర్తు చేశారు. అర్హులైన వారి ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్యా డర్దేన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అభివృద్ధి కోసం పని చేశాం.. మళ్లీ పని చేస్తామన్నారు.
ఆగిపోయిన పనులు పూర్తి చేస్తామని.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనని.. ఈ జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, అంజయ్య యాదవ్, నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, రజినీ సాయిచంద్, నాయకులు కోడుగల్ యాదయ్య, పిట్టల మురళి, దోరెపల్లి లక్ష్మి, ప్రణీల్ చందర్, నాగిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, జయప్రదతోపాటు పలువురు పాల్గొన్నారు.
గులాబీ శ్రేణులను ఇబ్బంది పెడితే సహించం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకున్నా.. శ్రేణులు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారికి అండగా ఉంటామని, వారిని ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూస్తామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధి ంచిన పార్టీ.. పదేళ్లు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. పదేళ్లు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగడానికి నీళ్లు లేవు.. తినడానికి తిండి లేదు.. గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసేవారు.. డబ్బు ఏండ్ల పాలనలో తాగునీళ్లు కూడా ఇవ్వలేదన్నారు.
గతంలో సర్పంచ్ నుంచి ఫోన్ వస్తే నీళ్లు తప్పా ఇంకేం అడిగేవారు కాదు.. ఆ దుస్థితికి దిగజార్చిన ఘనత కాంగ్రెస్‌కి దక్కిందన్నారు. ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు గమనిస్తే బీఆర్ఎస్ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. పంటలు పండటం, పనులు దొరకడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, అందుకే పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణనీయంగా అభివృద్ధి జరిగితే, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో మళ్లీ ఇరవై ఏండ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లిందన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కాబోయే సీఎం కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి దొంగలు వెళ్లిపోయారు.. మళ్లీ వాళ్లను పార్టీలోకి తీసుకోం.. నమ్మి పదవులు ఇస్తే మోసం చేశారు.. దేవుడే వాళ్ల సంగతి చూసుకుంటారని ఆయనన్నారు. సర్‌పై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, మన ఓట్లు ఒక్కటి కూడా పోకుండా చూసుకోవాలన్నారు. బీఎల్ఏలు జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు కూడా ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్లి రికార్డు స్థాయిలో కార్యకర్తలను చేర్పించాలన్నారు.