తాడూరు, మే 26 : అన్నదాతలు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో దళారులదే పైచేయి అని మాజీ ఎమ్మెల్యేమర్రిజనార్దన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 15రోజులుగా మొక్కజొన్న బస్తాలను గోదాంల వద్ద దించే క్రమంలో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారంటూ రైతులు సోమవారం నాగర్కర్నూల్ -జడ్చర్ల ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేమర్రిజనార్దన్రెడ్డి మండలంలోని ఇంద్రకల్ గ్రామ సమీపంలోని మణికంఠ కాటన్ జిన్నింగ్మిల్లులో ఉన్న గోదాంల వద్దకు మంగళవారం చేరుకొని పరిస్థితిని గమనించారు.
మంత్రి ఆదేశాలతో నాగర్కర్నూల్ స్థానిక రైతులకు చెందిన ట్రాక్టర్లను దించకుండా కొల్లాపూర్ నుంచి వచ్చిన మొక్కజొన్న లారీలను మాత్రమే ఖాళీ చేస్తున్న పరిస్థితిని గమనించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక గోదాంలో స్థానిక రైతులకు అవకాశం కల్పించకుండా కొల్లాపూర్ నుంచి వచ్చిన వాహనాలను ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమని కుర్చీ వేసుకుని గోదాం ఎదుట కూర్చొని నిరసన తెలుపగా మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు లారీలను పక్కకు పెట్టించి స్థానిక రైతులకు చెందిన ట్రాక్టర్లను లోపలికి పిలిపించి మొక్కజొన్న బస్తాలను ఖాళీ చేయించి పంపించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం ఇప్పటికే 80శాతం కొనుగోలు చేసిందని ఒక మంత్రి చెప్పగా సీఎం, మంత్రులు తలోదారి ప్రెస్మీట్లు పెట్టడం తప్పా రైతులను ఆదుకోవడం లేదన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు కూడా అందించడం లేదని రైతులే కొనుగోలు చేసి ధాన్యం నింపుకొని గోదాంకు తెస్తున్నారని అంతేకాకుండా లారీల కిరాయి కూడా రైతులే చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. ఒక క్వింటాల్ వడ్లకు పది కిలోలు తరుగు తీస్తూ వచ్చే డబ్బులను అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
చాలా మంది రైతులు ఇప్పటికే రూ.1600 లకే మక్కలను ప్రైవేట్ దళారులకు అమ్ముకున్నారని వాటి ని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్ద తు ధర రూ.2400లకు అమ్ముకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారన్నారు. గో దాంల దగ్గర రైతులు వారం, పది రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా ఎమ్మెల్యే, మం త్రి గాని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లా మంత్రి కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన మొక్కజొన్నను మణికంఠ మిల్లులో స్టాక్ చేస్తున్నారని తాడూరు మండలానికి సంబంధించిన మక్కలను దించడం లేదని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయం చేయకూడదన్నారు. కొంతమంది రైతులు మొక్కజొన్న అమ్మి రెండు నెలలు గడుస్తున్నా వారి అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటికీ స్పందించడం లేదన్నారు. ఈ సంవత్సరం రైతులు పెద్దఎత్తున ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటను సాగు చేశారని, రైతుబంధు కూడా ఇప్పటి వరకు మూడెకరాలలోపు వేయలేదని కేసీఆర్ మీటింగ్ పెడితేనే రైతుబంధు వేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సిం గిల్ విండో మాజీ అధ్యక్షుడు ఎండీ.సమద్పాషా, ఇంద్రకల్ మాజీ సర్పంచ్ రమణ, పర్వతాలు, యార ప్రసాద్, గడ్డం మశన్న, యార కృష్ణయ్య, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.