వనపర్తి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదాపు రూ.10 కోట్లను మంజూరు చేయించి హైలెవెల్ బ్రిడ్జికి ప్రతిపాదించి పనులు చేపట్టారు. ఇక్కడ పిల్లర్లు, స్లాబ్‌లు పూర్తి చేశారు. కేవలం మట్టి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు చేయక పోవడం వల్ల ఈ ఏడాది వర్షాల సీజన్లో దాదాపు 20 రోజులు వనపర్తి-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వనపర్తి జిల్లాలో రోడ్డు బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఈ పనుల్లో కదలిక లేదు. వర్షాల కారణంగా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న లక్ష్యంతో అనేక బ్రిడ్జిలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కొన్ని పనులు చేపట్టి పూర్తి చేశారు. చివరి దశల్లో మరికొన్ని పనులు నిలిచిపోయాయి. ఇంకొన్ని మధ్యలోనే ఆగాయి. ఈ బ్రిడ్జీలన్నీ అధిక రవాణా ఉండే ప్రధాన రోడ్లను అనుసరించే ఏర్పా టు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చూస్తే.. 10కి పైగా బ్రిడ్జిల పనులు నిలిచిపోయాయి. దీంతో వర్షాలు పడినప్పుడల్లా రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం అనేక పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం ఉన్నది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే రో డ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పనులన్నీ నిలిచాయి. దీంతో గడిచిన రెండేళ్లుగా నూతన ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై ఉన్న ఈ బ్రిడ్జీలు పూర్తి చేస్తే.. ఎంతటి వరద వచ్చినా జిల్లాలో రవాణా వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదన్న అభిప్రాయం ఉన్నది. ఈ ఏడాది వర్షాల దెబ్బకు బ్రిడ్జి పనులున్నచోట్ల రవాణా రాకపోకలు నిలిచి పోయాయి.
14 బ్రిడ్జి పనులుంటే..
జిల్లాలోని పలు చోట్ల 14 రోడ్డు బ్రిడ్జి పనులుంటే వీటి లో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. అధికంగా పెండింగ్‌లోనే ఉండి ఆయా దశల్లో నిలిచిపోయాయి. మదనాపురం సమీపంలోని వాగుపై నిర్మించిన బ్రిడ్జి కేవలం మట్టిపనులు చేయకపోవడం వల్ల ఆగిపోయింది. 18 పిల్లర్లు, 19 శ్లాబులు పూర్తి చేయగా రెండేళ్లుగా మట్టి పనుల కోసం ఎదురు చూస్తున్నది. ఏదుట్ల-కేశంపేట మధ్య బ్రిడ్జి పనులు మొదలు కాలేదు.
కేతేపల్లి సమీపంలో రూ.3కోట్లతో బ్రిడ్జి నిర్మించినా అసంపూర్తిగానే మిగిలింది. పెబ్బేరు పరిదిలోని శేరిపల్లి, వెంకటాపురంల్లో చేపట్టిన రెండు బ్రిడ్జీల పనులు సగంలోనే నిలిచి పోయాయి. మోజర్ల సమీపంలో రెండు బ్రిడ్జీలుంటే అసంపూర్తిగానే ఉన్నాయి. ఎల్కిచెర్లలో చేపట్టిన బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. ఇక ఘణపురం మండల కేంద్రంతోపాటు రైస్‌మిల్లు దగ్గర వేర్వేరుగా ఏర్పాటు చేసిన రెండు బ్రిడ్జీలు, సూగూరు బ్రిడ్జి, చిమనగుంటపల్లి సమీపంలోని రెండు బ్రిడ్జీల పనులు పూర్తయ్యాయి.
రూ.16 కోట్లు పెండింగ్..
జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు దాదాపు ఏడాదికి పైగా బిల్లుల చెల్లింపులు ఆటకెక్కాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దాదాపు పది వరకు పనులు జరిగిన బ్రిడ్జీలకు రూ.16 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఏడాది కిందట రికార్డు చేయబడి పేమెంట్ కోసం ఎదురు చూస్తున్నవి. ప్రభుత్వం ఇప్పుడప్పుడంటూ కాలయాపన చేస్తుండడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అలాగే అసంపూర్తిగా మిగిలిన పనుల చేసేందుకు కూడా ఆసక్తి కనబర్చడం లేదు. రికార్డు అయిన బిల్స్‌ను ఇస్తే.. మిగిలిన పనులు చేస్తామన్నట్లు కాంట్రాక్టర్లు మొండికేశారు. ప్రభుత్వం ఇవ్వదు.. పను లు చేయరన్నట్లుగా జిల్లాలోని ప్రధాన రోడ్డు బ్రిడ్జీల పరిస్థితి నెలకొంది.
బ్రిడ్జి పనులు పూర్తి చేయిస్తాం..
జిల్లాలో మిగిలి పోయిన బ్రిడ్జి నిర్మాణాల పనులను పూర్తి చేయిస్తాం. మదనాపురం సమీపంలోని వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఎర్త్ వర్స్ పూర్తి చేసేందుకు రూ.5.70 కోట్లకు అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదించాం. మిగితాచోట్ల కూడా బ్రిడ్జి పనులు నిలిచి పోయాయి. కొన్ని బిల్స్ పెండింగ్ ఉండటం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు సుముఖంగా లేరు. కొన్ని పేమెంట్లు వచ్చిన వెంటనే మిగిలిన పనులన్నిటినీ పూర్తి చేయిస్తాం.
– విష్ణువర్ధన్, డీఈ, రోడ్లు, భవనాల శాఖ, వనపర్తి జిల్లా