వనపర్తి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య ఇంకా కొలిక్కి రాలేదు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. దీంతో రాష్ట్రస్థాయిలో శ్రీధర్‌రెడ్డి హత్య పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో దాడులు, హత్యల పరంపర కొనసాగుతుందని బీఆర్ఎస్, అలాంటిదేమీ లేదని అధికార కాంగ్రెస్ పార్టీలు మాటల యుద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీపల్లిలో మే 22న అర్ధరాత్రి ఇంటిపక్కనున్న క ల్లందొడ్డిలో నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డి హత్యకు గురయ్యా డు. ఎలాంటి రాజకీయ పదవిలో లేకపోవడం, వివాదాలకు దూరంగా ఉండే శ్రీధర్‌రెడ్డి హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఘటన జరిగినప్పటి నుం చి పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. రాజకీయ నేతలు, కుటుంబసభ్యులు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పక్కా ప్రణాళికతో చేసిన ఈ హత్యలో ఎలాంటి ఆధారాలు లభించక పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఘటనాస్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, డాగ్ స్కాడ్ పరిశీలనలోనూ బహిరంగంగా కనిపించేంత సాక్ష్యాలు లభించలేదు. దీంతో ఇంకా ఎంతకాలం దర్యాప్తు చేస్తారోనన్న చర్చ నడుస్తున్నది.
హత్యా ఘటనలో అనుమానితులందరినీ పోలీసు లు విచారిస్తున్నారు. ఇప్పటివరకు గ్రామస్తులతోపాటు పక్క గ్రామాలకు చెందిన దాదాపు 30 మందిని విచారించినట్లు అనధికార సమాచారం. స్నేహితులు, రియ ల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన సంబంధాలు, రాజకీయ ప్రత్యర్థులు, అనుమానిత మహిళలతో ఉన్న అంశాలపైనా పోలీసులు నిఘా పెట్టి విచార ణ చేస్తున్నట్లు సమాచారం. కేసును సీరియస్‌గా పరిశీలిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సమాచారం లభించకపోవడంతో మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. శ్రీధర్‌రెడ్డితో సహా అనుమానితుల ఫోన్లను పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. హ త్య జరిగిన మరుసటి రోజు ఎస్పీ రక్షితామూర్తి గ్రామా న్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. నెల రోజులుగా పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నా నిం దితుల జాడ మాత్రం తెలియకపోవడం శోచనీయం.
ఈ హత్యతో లక్ష్మీపల్లి గ్రామం కొన్ని రోజుల వరకు భయం గుప్పిట్లో గడిపింది. ఆ ఊరిపై పోలీసు లు పక్షం రోజులపాటు ప్రత్యేక నిఘా ఉంచారు. హ త్యకు రాజకీయ మరకలు అంటుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఖాకీలు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు గ్రామానికి వచ్చి అవసరమైన వారి తో మాట్లాడి వెళ్తున్నారు. వానకాలంలో ప్రజలు సే ద్యం పనుల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే, శ్రీధర్‌రెడ్డిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అన్న ప్రశ్నలు వేధిస్తున్నా.. సమాధానం, నిందితుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో హంతకులను కచ్చితంగా పట్టుకుంటాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అనుమానితులందరినీ పిలిపించి విచారణ జరుపుతున్నాం. ఇంకా కొందరిని చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను తప్పకుండా పట్టుకుంటాం. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నాం. ఈ కేసు త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాం.