మహబూబ్‌నగర్, జూలై 9 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రోగికి వైద్యం అందించాలంటే రక్త పరీక్షలు తప్పనిసరి. కానీ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా దవాఖానలు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, ఏరియా దవాఖానల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం మమబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖానకు పంపిస్తుంటారు. వీటి ఫలితాలు వచ్చాకే గర్భిణులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఆ నివేదికల ఆధారంగా వైద్యసేవలు అందిస్తారు.
అసలే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో జిల్లా జనరల్ దవాఖానలో రక్ష పరీక్షలు నిర్వహించే పరికరం మరమ్మతులకు గురికావడంతో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పేద రోగులు పెద్ద పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 56 రకాల ఖరీదైన రక్త పరీక్షల కోసం పేద రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లకుండా టీ హబ్‌ను ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి ప్రజలకు రక్త పరీక్షలు చేస్తున్న పరికరాలు కొన్ని రోజులుగా మొరాయిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలోని టీ హబ్‌కు ప్రతి రోజూ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 350, ప్రభుత్వ జనరల్ దవాఖాన నుంచి 200, నారాయణపేట జిల్లా నుంచి 450 చొప్పున రక్త నమూనాలు ఇక్కడికి వస్తుంటాయి. రోజు వెయ్యి వరకు నమూనాలు వస్తుంటాయి. వీటిలో షుగర్‌ను నిర్ధారించే అనేక రకాల పరీక్షలు, కిడ్నీ, లివర్, గుండెలో కొవ్వు, కాల్షియం, హిమోగ్రామ్ నిర్ధారించే పరీక్షలు చేసే బయోకెమిస్ట్రీ యంత్రం పాడైయిపోయింది.
దాదాపు 13 రోజుల నుంచి వీటికి సంబంధించిన పరీక్షలు నిలిచిపోవడంతో దవాఖానకు వచ్చిన రోగులు రక్త పరీక్షల కోసం బయట ఉన్న ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఇబ్బందులకు పాలవుతున్నారు. రూ.వేలలో ఉన్న పరీక్షలకు డబ్బులు చెల్లించుకోలేక కొంత మంది పరీక్షలకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనరల్ దవాఖానలోని టీహబ్‌లోని రక్త పరీక్షల పరికరానికి మరమ్మతులు నిర్వహించి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
టీ హబ్‌లో బయోకెమిస్ట్రీ రక్త పరీక్షల యంత్రాం పాడై పోయిందని తెలుసుకొని నేను వచ్చిన వెంబడే ఆ సంస్థ సర్వీస్ ఇంజినీర్‌కు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి పరీశీలించి వెళ్లారు. దీనికి మరమ్మతులు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే త్వరలో మరమ్మతులు నిర్వహించి రక్త పరీక్షలు ప్రారంభిస్తాం.
– సందీప్కుమార్సింగ్, సూపరింటెండెంట్, పాలమూరు జనరల్ దవాఖాన