చూడముచ్చటైన అందంతో.. చురుగ్గా కదులుతూ.. చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంటే.. ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే.. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు రైతుల పాలిట శాపంగా మారాయి. మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నది. జింకల సంతతి భారీ స్థాయిలో పెరిగిపోవడం, నదీ తీర ప్రాంతం కావడంతో ఒక్కో గుంపులో 30 నుంచి 50 జింకలు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ఆముదం, చిరుధాన్యాల పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు పొలాలగట్లపై నిద్ర కాస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. గత కేసీఆర్ సర్కార్ కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో 74 ఎకరాలను అటవీ శాఖ అధికారులకు కేటాయించింది. ఇందులో ఫినిషింగ్ ఏర్పాటు చేసి కృష్ణ జింకలను ఒక సమూహంలోకి తీసుకురావాలని కేంద్రానికి నివేదిక పంపింది. అయినా కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణ జింకల నుంచి పంటలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 17 : నియోజకవర్గంలో నీటి వనరులు, సాగు విస్తీర్ణం, గణనీయంగా పెరగడంతో కృష్ణ జింకల సంతతి కూడా పెరిగింది. గతంలో నీటి వసతి లేని కారణంగా ఆముదం చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్న క్రమంలో జింకల అలజడి పెద్దగా ఉండేది కాదు. కాలక్రమేణా నియోజకవర్గంలో నీటి వసతితోపాటు హరితవనం పేరిట చిట్టడువుల విస్తీర్ణం పెరగడంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతంలో జింకల సంతతి పెరిగింది. కృష్ణ జింకల సంఖ్య పెరగడంతోపాటు దుప్పిల సంఖ్య గణనీయంగా ఉండడం వల్ల కృష్ణ జింకల సంతానం క్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. తాగడానికి నీరు విస్తారంగా పంటల సాగు, ఆహార కొరత, నీటి కొరత తీరుస్తుండడంతో ఈ ప్రాంతంలో జింకలు గుంపులు గుంపులుగా పంట పొలాలపై దాడి చేసి రైతుల కష్టాన్ని, పండిన పంటకు నష్టం చేకూరుస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం ప్రాంతంలో కృష్ణా, భీమా నదుల పరీవాహక ప్రాంతం సంగమంగా ఏర్పడ్డ చోట అడవి ఉండడంతో అకడి నుంచి జింకల సంతతి భారీ స్థాయిలో పెరిగి కర్ణాటక ప్రాంతం నుంచి మక్తల్ నియోజకవర్గం వైపు కృష్ణ జింకల దారి మళ్లడంతో ఈ ప్రాంతంలోని రైతులకు జింకల బెడద తప్పడం లేదని చెప్పుకోవచ్చు. కృష్ణ జింకలు 30 నుంచి 50 జింకల గుంపు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలో ఒక బలిష్టమైన మగజింక ఉంటుంది. మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. దీని కొమ్ములు మూడు నుంచి నాలుగు మలుపులతో మెలికలు తిరిగి సుమారు 28 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయి. మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోదుమ రంగులో ఉండి కడుపు ఇంకా కళ్ల చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. వీటికి భిన్నంగా జింకలు లేత గోధుమ రంగులో ఉంటాయి వీటికి కొమ్ములు ఉండవు. ఇవి గడ్డిని, పండ్లను తింటుంటాయి, ఎప్పుడు బయటకు వెళ్లినా ఒంటరిగా వెళ్లవు గుంపుగా బయలుదేరి పంట పొలాలపై ఒకసారిగా దాడి చేయడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒకప్పుడు సాగునీరు లేక నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలాల్లో రైతన్నలు ఆముదం పంటతోపాటు చిరుధాన్యాల పంటలను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లను పూర్తి చేసి భీమా నీటితో రెండు రిజర్వాయర్లను నింపడం వల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు పుషలంగా అందుతుండడంతో పంటల విస్తీర్ణం పెరిగింది. సాగునీటి వనరులు, పంటల విస్తీర్ణంతోపాటు కృష్ణ జింకలు పెరిగిపోవడంతో వాటి వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలను నాశనం చేసేందుకు మిడతల దండులాగే కృష్ణ జింకల దండు ఒకసారిగా వచ్చి పడుతుండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట విత్తినప్పటి నుంచి చేతికొచ్చే వరకు రైతులు పొలాల వద్ద ఉండి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే వీటి దాడి ఎక్కువవుతున్నదని వాపోతున్నారు. జింకల బెడదల వల్ల కంటికి కునుకు లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ అడవుల నుంచి కృష్ణ జింకలు ఇకడికి రావడంతో కృష్ణ జింకలను నియంత్రించే పనిలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వీటి ఆవాసం పూర్తిస్థాయిలో పెరిగి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో ప్రభుత్వ సర్వే నెంబర్ 192,194 లో 74 ఎకరాల 10 గుంటల భూమిని అటవీ శాఖ అధికారులకు కేటాయించారు. ఈ భూమిలో ఫినిషింగ్ ఏర్పాటు చేసి కృష ్ణజింకాలను ఒకే సమూహంలోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ జింకల సంపతి మూడు వేల వరకు ఉంటుందని అంచనా. కొత్త ఏర్పడిన ప్రభుత్వమైనా స్పందించిన కృష్ణ జింకల నుంచి రైతులను పంటల పొలాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి సాగు చేసిన పంట అంతా జింకల పాలవుతున్నది. వేలకు వేలు ఖర్చు పెట్టుకొని విత్తనాలు తీసుకొచ్చి పొలంలో పంట సాగు చేసుకుంటే విత్తనాలు విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు జింకల బెడద నుంచి తప్పించి పంట కోసుకొనే వరకు తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అచ్చంపేట ప్రాంతం లో వేలాది సంఖ్యలో జింకల గుంపులు పొలాలపై సంచరిస్తూ పొలాల ను నాశనం చేస్తున్నాయి. జింకల బెడద నుంచి రైతులను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
వ్యవసాయమే జీవనాధారంగా ఉండడంతో మేం పొలాల్లో సాగు చేసుకున్న పంటలను కృష్ణ జింకలు నాశనం చేస్తున్నాయి. పంట వేసిన మొదలు కోత దశకు వచ్చే వరకు కంటి రెప్పలా కాపాడుకుంటున్నా.. వేలాదిగా వచ్చే జింకల గుంపుల నుంచి మా పంటలను కాపాడుకోలేక పోతున్నాం. దీంతో సాగు కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోతున్నా పంటలు మాత్రం చేతివచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. జింకల బారి నుంచి పంటలను కాపాడాలని అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొత్త ప్ర భుత్వమేనా రైతుల ఇబ్బందులు తీర్చుతుందని ఆశీస్తున్నాం.
మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ జింక అలజడి గణనీయంగా పెరిగిన విషయం వాస్తవమే. గతంలో పంటల విస్తీర్ణం తకువగా ఉండడం వల్ల కృష్ణ జింకలు తకువగానే ఉండేవి. ప్రస్తుతం నీటి వనరులు, పంటల విస్తీర్ణం పెరగడంతో కృష్ణ జింకల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. జింకల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ ద్వారా గతంలో ప్రభుత్వానికి నివేదిక అందించాం. ప్రస్తుతం ప్రభుత్వ మార్పిడి అయినందువల్ల మరోసారి నివేదిక ప్రభుత్వానికి అందించి జింకల బెడద నుంచి రైతులను రక్షించే చర్యలు చేపడతాం.
నియోజకవర్గంలో కృష్ణ జింకల బెడద నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. జింకలను నియోజకవర్గం నుంచి తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసెంబ్లీ సమావేశాల్లో పలు దఫాలుగా చర్చించాం. మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలంలో జింకల బెడద భారీ స్థాయిలో ఉన్నది వీటివల్ల రైతులు సాగు చేసుకున్న పంటలు జింకలు నాశనం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ప్రభు త్వం నుంచి అటవీ పెంపుదల కోసం సరైన సాకారం లేక పోవడంతో వాటిని నివారించలేక పోయాం. ప్రస్తుత ప్రభుత్వమైన జింకల బెడద నుంచి రైతుల బాధలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి.