కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి భవన్లో శనివారం జరిగిన భూ భారతి ( Bhu Bharati ) చట్టంపై అవగాహన సదస్సు రసాబాసగా జరిగింది. వేదికపై కాంగ్రెస్ నాయకులే ( Congress Leaders ) అధికంగా ఉండడం, వారిలో రైతులు కానివారు ఉండడంతో బీజేపీ నాయకులు ( BJP Leaders ) అభ్యంతరం వ్యక్తం చేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్న సదస్సులో వేదికపై కాంగ్రెస్ నాయకులు ఉండడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకదశలో ఇరువురు గట్టిగా వాదనలు చేసుకున్నారు. అవగాహన సదస్సా లేక కాంగ్రెస్ పార్టీ మీటింగా అంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే పిలిచి సమాచారాన్ని తెలియజేస్తే సరిపోతుందని విమర్శించారు.
ఈ అవగాహన సదస్సు కేవలం కాంగ్రెస్ నాయకులకు తెలిస్తే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయా అంటూ ధ్వజమెత్తారు. చివరకు అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని ఇరువుని శాంతింపజేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి వల్ల రైతుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని భూ సమస్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసమే నూతనంగా భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రాములు, ఏవో సురేష్, ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.