హన్వాడ, మే 13 : జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఆదరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెందిన బీజేపీ నాయకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో పార్టీల, కులమతాలకతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కులమతాల పేరిట చిచ్చుపెడుతూ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుదని, దీనిని తిప్పికొట్టాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నిరంతర విద్యుత్, రైతుబీమా, రైతుబంధు అమలవుతుందా అని ప్రశ్నించారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి నరేశ్‌తోపాటు 20 మంది ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీపీ బాలరాజు, సింగిల్‌విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, నాయకులు లక్ష్మయ్య, శేఖర్, రమణారెడ్డి, చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.