Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ‘నిరుద్యోగ మార్చ్’ పేరిట బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారు. మంగళవారం చేపట్టనున్న ర్యాలీ సక్సెస్ మాట అటుంచితే సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇటీవల టెన్త్ పేపర్ లీకేజీలో కీలకంగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తుండడంతో నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. తామంతా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన భారీ నోటిఫికేషన్‌కు ప్రిపేరవుతున్నామని, ర్యాలీకి రామంటూ నిరుద్యోగులు తేల్చేసి చెప్పడంతో సదరు నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కిరాయికి అయినా నిరుద్యోగుల మాటున యువతను తీసుకురావాలని భావిస్తున్నారట.
‘బండి’కి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు గోబ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. పేపర్ లీకేజీలో భాగస్వామ్యమైన వ్యక్తి.. నిరుద్యోగుల పేరిట ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ మాత్రం లీకేజీల మాటున అడ్డుకుంటుందంటూ విమర్శిస్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా ఎదిగిన బీఎస్ఎన్ఎల్ను అంబానీ కోసం మోదీ నిర్దాక్షిణ్యంగా బలి చేశారం టూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, ఎన్ని భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టుమని పాతిక మంది నాయకులు కూడా హాజరుకాలేదు. ర్యాలీ కోసం నిరుద్యోగులను ఉమ్మడి జిల్లా నుంచి సమీకరించాలని ఇటీవల సమావేశంలో నిర్ణయించుకోగా.. ఒక్కరు కూడా వచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో నిరుద్యోగ మార్చ్ కాస్త కార్యకర్తల మార్చ్లాగా సాగేలా ఉన్నదని మదనపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో బీజేపీ చేపట్టే నిరుద్యోగ మార్చ్ సక్సెస్ అవుతుందో లేదోనని ఆపార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రూప్ ఎగ్జామ్స్‌కు తేదీలు ఖరారు చేయడం.. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో అభ్యర్థులు ఉద్యోగవేటలో పడ్డారు. ఏ పట్టణంలో చూసినా స్టడీ సర్కిళ్లు, గ్రంథాలయాల్లో అభ్యర్థులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. వాళ్లను నిరుద్యోగ మార్చ్‌కు రమ్మని పిలవడానికి వెళ్లిన నేతలకు చుక్కెదరువుతున్నది. చివరికి కిరాయికైనా తీసుకురావాలని పార్టీ పెద్దలు ఆదేశించడంతో నేతలు ఆ పనిలో పడ్డారట..
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంగళవారం పాలమూరులో భారీ ఎత్తున నిరుద్యోగులతో ర్యాలీ చేపట్టాలని బీజేపీ నాయకులు భావించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తుండగా.. ఉమ్మడిజిల్లాలో నిరుద్యోగల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ఈక్రమంలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు బండి గోబ్యాక్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. టెన్త్ పేపర్ల లీకేజీలో హస్తం ఉన్న నేతలు జిల్లాకు ఏమొహం పెట్టుకొని వస్తారని నిలదీస్తున్నారు. ఈ జిల్లాకు ఏం చేయని సన్నాసులు నిరుద్యోగులను ఎరగా వాడుకునేందుకు ఆందోళనకు దిగడం సిగ్గుచేటన్నారు. జిల్లా, నియెజకవర్గకేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను అడిగిన అందరికీ ఉద్యోగాలు పెట్టిస్తున్నారని.. అందులో బీజేపీ నేతల పిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. మే 6న మంత్రి కేటీఆర్ ఐటీ, ఎనర్జిటిక్ పార్కును ప్రారంభిస్తారని.. అవసరమైతే బీజేపీ నేతలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ కూడా జిల్లాకు వస్తుందని.. ఏడాదికి 10వేల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మో దీ.. ఉమ్మడిజిల్లాలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వే తపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీఎస్ఎన్ఎల్ కంపెనీనీ ఎత్తివేసి అందులో పనిచేస్తున్న ఉ ద్యోగులను మోసం చేసిందని మండిపడ్తున్నారు. పరోక్షంగా ఎంతోమంది పొట్టగొట్టారని.. ఈ విషయం బీ జేపీ నేతలకు తెలియదా? అని నిలదీస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 16లక్షల ఆయకట్టుకు నీరందించే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్న మోసం చేసి.. ఏ మొహం పెట్టుకొని నిరుద్యోగ మార్చ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
పాలమూరులో చేపట్టే నిరుద్యోగ మార్చ్‌కు తరలించడానికి బీజేపీ నేతలు వెంపర్లాడుతున్నారు. ఉమ్మడిజిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి వెయ్యి మందిని తరలించాలని ఆదేశాలుండగా.. ఒక్క నిరుద్యోగి కూడా మార్చ్‌కు రావడం లేదని బీజేపీ నేతలు వాపోతున్నారు. బండి సంజయ్ వస్తున్నందున ఎలాగైనా జనసమీకరణ చేయాలని నేతలు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఇటీవల ఐదు విభాగాలకు సంబంధించి ఉద్యోగాల కోసం పరీక్ష తేదీలను ఖరారు చేసి మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో ఉమ్మడిజిల్లాలో ఎక్కడ చూచినా కోచింగ్ సెంటర్లు, స్టడీ స్కర్కిళ్లు, గ్రంథాలయాలు కిక్కిరిసిపోయాయి. కొంతమంది ఇండ్లల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతున్న వారికి బీఆర్ఎస్ నేతలు ఆహారం, మంచినీరు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో బండి మార్చ్‌కు వచ్చేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపడం లేదు. దీంతో బీజేపీ నేతలు కిరాయి నిరుద్యోగులను తీసుకొచ్చే పనిలో పడ్డారు.
బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను తీ వ్రంగా మోసం చేసింది. రెండుకోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాకే స మావేశాలు నిర్వహించాలి. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకొని జి ల్లాకు వస్తున్నాడో నిరుద్యోగులకు క్లా రిటీ ఇవ్వాలి. జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సారథ్యంలో వందలాది మందికి పలు చోట్ల ఉద్యోగాలు కల్పించిన విషయం తెల్సుకోవాలి.
– సుదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహబూబ్‌నగర్
నిరుద్యోగులను మోసం చేసేందుకే బీజేనీ నిరుద్యోగ మార్చ్ చేపట్టింది. ముందు ఈ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేసి.. ఆ తర్వాత నిరుద్యోగ మార్చ్ చేపట్టాలి. మేలో కేటీఆర్ దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ ప్రారంభిస్తున్నారు. దీంతో జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుంది. కావాలంటే బండి సంజయ్ దరఖాస్తు చేసుకుంటే క్వాలిఫికేషన్‌ను బట్టి మంత్రి ఉద్యోగం ఇప్పిస్తారు.
– శివయాదవ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర నడుస్తుంది. ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో నిరుద్యోగులు చదువుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ పేరిట ఆందోళన చేపట్టడం నిరుద్యోగులను మోసం చేయడమే. ఈ మార్చ్‌కు మేం రామని నిరుద్యోగులు ఖరాఖండిగా చెప్తున్నారు. నిరుద్యోగ మార్చ్ బదులు ఉద్యోగాల మార్చ్ అని పెట్టుకోండి.. అప్పుడైనా నిరుద్యోగులు మిమ్మల్ని క్షమిస్తారు.
– సత్య ముదిరాజ్, పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్