మహబూబ్‌నగర్, జూన్ 13 : మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ముందుకు అడుగులు వేస్తున్నామని, మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, భరోసాను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళల పేరిట అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మహబూబ్‌నగర్‌లో తాగేందుకు నీరు కూడా లేదని, నేడు తాగునీటి ఇబ్బందులు లేవన్నారు. మహిళల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు పోలీస్‌శాఖ రక్షణ కల్పించేందుకుగాను షీటీమ్స్‌తో పాటు పోలీసులకు ప్రత్యేక వాహనాలను అందించడం జరిగిందన్నారు. అన్నిరంగాల్లో మహిళలు అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. అనంతరం పలు రంగాల్లో రాణించిన మహిళలకు ప్రశంసా పత్రాలను మంత్రి అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవినాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మధుసూదన్‌గౌడ్, ఎల్డీఎం భాస్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసులు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఇందిర, సీపీవో దశరథం, మత్స్యశాఖ ఏడీ రాధా రోహిణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సీడీపీవో శైలశ్రీ, కౌన్సిలర్లు, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
70ఏండ్ల అభివృద్ధి తొమ్మిదేండ్లలో..
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 13 : ఉమ్మడి రాష్ట్రంలో 70ఏండ్లలో చేపట్టని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం కోయిలకొండ చౌరస్తాలో వార్డు పర్యటనకు వెళ్తూ అబ్దుల్‌ఖాదర్ దర్గా వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న బ్రిడ్జి స్లాబ్ పనుల నాణ్యత పరిశీలించి మంత్రి క్యూరింగ్ చేశారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వార్డులో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అనంతరం కోయిలకొండ చౌరస్తాకు చెందిన బీజేపీ నాయకులు రవికుమార్‌యాదవ్, మహేశ్, రాజేశ్, సత్యనారాయణ, బాలుతోపాటు వందమంది నాయకులు కౌన్సిలర్ కోట్ల నర్సింహులు యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీజెపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక..
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 13 : కులమత బేధాలు లేకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. హన్వాడ మండలంలోని కొత్తపేటకు చెందిన బీజెపీ యువమోర్చ మండల ప్రధాన కార్యదర్శి శివలింగంయాదవ్, రాజుయాదవ్, మాదారానికి చెందిన నాయకులు రామకృష్ణ, మణికంఠ, కాంగ్రెస్ నాయకుడు మహేశ్యాదవ్తోపాటు 100 మంది బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నాయకులు రమణారెడ్డి, కొండ లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, రాజుయాదవ్, హరిచందర్నాయక్, రాములు, ఆనంద్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.