తిమ్మాజిపేట, సెప్టెంబర్ 6 : దేశంలోనే అతి పెద్ద ఏకశిలా వినాయక విగ్రహం తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి మందిర నిర్మాణం అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉన్నది. 30 అడుగుల విగ్రహం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిరాధరణకు గురువుతున్నది. విగ్రహ చరిత్రను పరిశీలిస్తే సుమారు 879 ఏండ్ల కిందట క్రీ.శ 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు చెక్కించాడు. ప్రస్తుతం గుల్బర్గా జిల్లాగా పిలవబడుతున్న ప్రాంతం, అప్పుడు బాదామి రాజ్యంగా ఉండేది.
దీనిని విక్రమాదిత్యుడు అనే రాజు పాలించేవాడు. పశ్చిమ చాశుక్యుల వంశానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమారులు. చాశుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని 200 ఏండ్లు పరిపాలించారు. ఈ క్రమంలో ఆయన రెండో కుమారుడు తైలంపుడు సామంత రాజుగా మన ఉమ్మడి జిల్లాలోని కందూరు రాజధానిగా చేసుకొని పాలించాడు. క్రీ.శ 1113లో రాజధానిని ఆవంచకు మార్చాడు. బాదామి రాజధాని వాతాపిలో 30 అడుగుల గణపతి విగ్రహం ఉండేది. అదే తరహలో ఆవంచలో శిలపై విగ్రహాన్ని చెక్కించడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో అతని తండ్రి మృతిచెందాడనే సమాచారంతో అతడు వాతాపికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. కొన్నేండ్ల కిందట ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు.
ఎనిమిదేండ్ల కిందట పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు. మందిర నిర్మాణ నమూనాను రూపొందించారు. మూడేండ్ల కిందట పూణే కేంద్రంగా నడుస్తున్న ఒక ట్రస్ట్ కూడా ముందుకొచ్చింది. ప్రధాన మందిరంతో పాటు, గుడి చుట్టూ 28 మందిరాలు నిర్మించాలని నిర్ణయించారు. అయినా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ఇక్కడ ఆలయం నిర్మిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఇంటర్నెట్లో ఈ విగ్రహం గురించి తెలుసుకొని భక్తులు ఇక్కడికి వస్తున్నారు. శనివారం చవితి ఉండగా.. విఘ్నాలను తొలగించే ఆ ఏకదంతుడి ఆలయ నిర్మాణానికి మాత్రం విఘ్నాలు తప్పడంలేదు.