భూత్పూర్ : రాష్ట్రంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి (Bhu Bharati) చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao) అన్నారు. మంగళవారం భూత్పూర్ పట్టణ కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ఏ చట్టాలను చేసినా ప్రజలకు అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించాలని కోరారు.
పాత చట్టాల్లో మార్పు చేయడం ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు మండలానికి ఒక సర్వేయర్ కాకుండా మరి కొంతమంది సర్వేయర్లను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ విచారణతో తహసీల్దార్ సమస్యను పరిష్కరించే విధంగా చట్టం పనిచేస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జీవన శైలిని మార్చుకోవాలని కోరారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేట్ పాఠశాలలో నాణ్యతలేని బోధకులు ఉంటారని తెలిపారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి( MLA Madusudarn Reddy ) మాట్లాడుతూ భూభారతీతో రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి , మహబూబ్ నగర్ ఆర్డీవో మోహన్ రావు, తహసీల్దార్ జయలక్ష్మి, మండల స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రభాకరాచారి, మున్సిపల్ కమిషనర్ రూరల్ నజీబ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.