భూత్పూర్, జూన్ 17 : ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేయడం సమంజసం కాదని, పాఠశాలల్లోనే యాజమాన్యాలు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, టై, బ్యాడ్జ్, బెల్టులు, బూట్లను విక్రయిస్తున్నట్లు తల్లిదండ్రులు కొందరు తన దృష్టికి తెచ్చినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి వ్యవహారాలను యాజమాన్యాలు నిర్వర్తిస్తే పాఠశాలల పట్ల కఠిన చర్యలను తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ సెలవులను పాటించకుండా రెండవ శనివారం, పండుగల సమయంలోను తక్కువ సెలవులను ఇస్తూ పాఠశాలలను నడుపుతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పాఠశాలల యాజమాన్యాలపై, పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని ఆమె అన్నారు.
అదేవిధంగా పాఠశాల బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయని, ప్రైవేటు పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆమె తెలిపారు. వీటన్నింటిని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. కొన్ని పాఠశాలల్లో నవోదయ, గురుకుల పాఠశాలలకు సన్నద్ధం చేస్తామని పెద్దపెద్ద హోర్డింగ్స్ను, బ్యానర్లను ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు ఠాగూర్, నాగేందర్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.