మూసాపేట : ప్రభుత్వ పాఠశాలలోనే ( Government Schools ) ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు( MEOs) రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్‌యూటీఎఫ్ ( TSUTF ) మహబూబ్‌నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అడ్డాకుల, మూసాపేట మండలాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్డాకుల మండల కేంద్రంతోపాటు శాకాపూర్, కందూరు, రాచాల, పొన్నకల్, పెద్దమునగలచెడు, తదితర గ్రామాల్లో, మూసాపేట మండల కేంద్రంతో పాటు జానంపేట, నిజాలాపూర్, వేముల కొమిరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో బడిబాటను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని , సర్కారు బడిని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రచార యాత్రను టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ కిష్టయ్య జండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం దిశగా ప్రచార యాత్ర నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు.
మంచి సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విలువలతో కూడిన విద్య అందుతుందని అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కే రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేష్ , జిల్లా నాయకులు వి భాస్కర్, హేమంత్ కుమార్, అజయ్, జయంతి, శంకర్ నాయక్, చిన్నయ్య, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.