మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 4 : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏ ఎస్) లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతున్నది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాలు ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడు తున్నాయి. పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారు. తోటి పిల్లలు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, షూస్ వేసుకుని దర్జాగా వస్తుంటే, బీఏఎస్ కింద చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం అవిలేక బడికి వెళ్లాలంటే కన్నీటి పర్యంతమవు తున్నారు. ప్రభుత్వం ‘బెస్ట్’ స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో భాగంగా పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యతోపాటు వసతి సదుపాయం ప్రభుత్వం కల్పిస్తున్నది. డే స్కాల ర్కు రూ.28వేలు, రెసిడెన్షియల్లో ఉండే విద్యార్థికి రూ. 42వేల చొప్పున పాఠశాలలకు విద్యా సంవత్సరంలో విడుతల వారీగా ఫీజు చెల్లిస్తున్నది. రెండేళ్లుగా ఈ స్కీం కు సంబంధించి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్కూల్ యాజమాన్యాలు వాపోతున్నాయి.
పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఇకనైనా బిల్లులు విడుదల చేయా లని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎం పిక చేసిన ఆరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రూ. 2,65,63,000లు మంజూరు చేయాలంటూ 26 బిల్లు లు సమర్పించాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 3 బిల్లులకు సంబంధించి రూ.25,63,000లు మాత్రమే మంజూరయ్యారు. ఇంకా 23 బిల్లులకు సంబంధించి రూ.2.40 కోట్లు బకాయి విడుదల చేయాల్సి ఉన్నది. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.
ఫీజు బకాయిలను గట్టిగా అడగలేని పరిస్థితిలో పాఠశా లల యాజమాన్యాలు ఉన్నాయి. అదేమంటే మరో దఫా ఎక్కడ తమ పాఠశాలలకు అనుమతులు ఇవ్వరో? అని సతమతమవుతున్నాయి. బకాయీలు పేరుకుపోవ డం తో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతి సదుపాయాలు కల్పించలేకున్నా.. అడిగే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో పాఠశాలల నిర్వహణకు తిప్పలు తప్పడం లేదు.
ఆర్థిక ఇబ్బం దులతో బీఏఎస్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే మారనుందా..? అనే సందేహాలు వ్యక్తం అవు తున్నాయి. కొన్ని పాఠశాలల్లో.. ‘మీ పిల్లల కు పుస్తకాలు, నోట్ బుక్కులు కావాలంటే ముందుగా డబ్బులిచ్చి కొనుక్కోండి.. ఆ తర్వాత ప్రభుత్వం నిధులిస్తే తిరిగి చెల్లి స్తాం..’ అని యాజ మాన్యాలు అంటున్నా యనే ఆరోపణలు లేక పోలేదు. పుస్తకాలు, నోట్‌బుక్స్ లేక టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయ కుండా బడికి వెళ్లి ఏం చేయాలని చిన్నారులు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. ఇక మేం బడికి వెళ్లమంటూ తెగేసి చెబుతున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద జిల్లాలోని ఎన్పీ సుబ్బారెడ్డి సెంట్రల్ స్కూల్, లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్, కాకతీయ మోడల్ స్కూల్ దేవరకద్ర, క్రీస్తుజ్యోతి హైస్కూల్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఢిల్లీ ఒలింపియాడ్ స్కూల్, రవీంద్రభారతి హైస్కూల్ ఇలా మొత్తం ఏడు ప్రైవేటు పాఠశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 1వ తరగతిలో ప్రవేశాలకు 91 మంది విద్యా ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నాన్ రెసిడెన్షియల్ కేటగిరీలో 55 సీట్లు కేటాయించారు. 5వ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 126 మంది దరఖాస్తు చేసుకోగా 58 సీట్లు లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 113 మందికి బీఏఎస్ కింద ప్రైవేట్ పాఠ శాలల్లో సీట్లు కేటాయించారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేటగిరీ వారీగా నిధులు కేటాయిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరానికి గానూ రూ.82,25,000 బడ్జెట్ వచ్చింది. గతంలో సబ్మిట్ చేసిన బిల్లులకు సంబంధించిన నిధులు ఈ-కుబేర్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. బీఏఎస్ అనుమతి పొందిన పాఠశాలలు విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిందే. ఈ విషయంపై ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతాం.
– సునీత, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి, మహబూబ్‌నగర్