హన్వాడ, జనవరి 12 : దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంబులయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హన్వాడ మండలంలో 1,100 మందిని దళితబంధు పథకానికి ఎంపిక చేసి వారితో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయించిందన్నారు. అప్పుడే ఎన్నికల కోడ్ రావడంతో దళితబంధు సాయం నిలిచి పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులను గ్రౌండింగ్ చే యాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు గడిచినా దళిత బంధుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో లబ్ధి దారులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు రూ.10 లక్షలు సాయం అందించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రం లో లబ్ధిదారులతో కలిసి ఆమరణదీక్షలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఈవోపీఆర్డీకి లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్య క్రమంలో దళిత నాయకులు ఆనంద్, బాలకిష్టయ్య, డబ్బరాములు, వెంకటయ్య, యాదయ్య, శ్రీనివా సులు, మొగులయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు.