పాన్‌గల్, ఏప్రిల్ 30 : మండలంలోని రాయినిపల్లి గ్రామానికి చెందిన మనీషాశ్రీ మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాయినిపల్లి గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే బీరం పర్యటించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదకుటుంబంలో పుట్టి పేదలకు వైద్యసేవలు అందించాలని దృఢ సంకల్పంతో ఆర్థిక స్థోమతలేకపోయినా కష్టపడి చదువుతున్న విద్యార్థిని మనీషాశ్రీ అకాల మరణం తన మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉండి పేదవారికి వైద్య సేవలు చేయాలనే తపన ఉన్న ముగ్గురు విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. అదేవిధంగా విషయం తెలుసుకొన్న ఎక్సై జ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు.