వనపర్తి, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) : పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడినా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటా యి..కానీ, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసుల పాత్ర ఉండాలని బీరం హితవు పలికారు. పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లికి చెందిన బాలునాయక్ పోలీసులు న్యాయం చేయడం లేదని ఆత్మహత్యాయత్నం చే సుకొని వనపర్తి దవాఖానలో చికిత్స పొందుతుండగా బుధవారం మాజీ ఎమ్మెల్యే బీరం బా లునాయక్ను పరామర్శించారు.
అనంతరం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసం లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పోలీసు వ్యవస్థ అధికారపార్టీకి పూర్తిగా వత్తాసు పలుకుతుందన్నారు. తెల్లరాళ్లపల్లిలో దాడికిగురై మూడు రో జులుగా ఎస్సైని వేడుకున్నా కనీసం పట్టించుకోలేదన్నారు. తిరిగి న్యాయం కోరి న బాధితులపైనే కేసు బనాయిస్తానంటూ ఎస్సై బెదిరించడంతో మనస్తాపం చెంది న బాలునాయక్ చివరకు క్రిమిసంహారక మం దు తాగేందుకు పాన్‌గల్ ఎస్సై వ్యవహారశైలే కారణమన్నారు. దాడులు చేసిన వారికి రక్షణ కల్పించి, బాధితులను మూడు రోజులు స్టేషన్లోనే ఉంచుకుని బెదిరింపులకు పాల్పడిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అదే మండలం దొండాయిపల్లికి చెందిన పలువురు యువకులను రోజంతా స్టేషన్లో ఉంచి వేధించడం జరిగిందన్నారు. చిక్కెపల్లిలోనూ అక్రమ ఇసుక దందాను అధికార పార్టీ వారు యథేచ్ఛగా చేస్తున్నా చర్యలు లేవన్నారు. వీపనగండ్ల మండలం తూంకుంట గ్రామంలో అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు అక్కడి రైతుపై దాడికి పాల్పడిన ఘటనలోనూ పోలీసులు తగిన న్యాయం చేయలేదన్నారు. ఇలా అన్ని మండలాల్లోనూ పోలీసుల పరిస్థితి ఇలాగే ఉందని, అవసరమైతే డీజీపీ ఇక్కడి పోలీసుల తీరుపై అంతర్గత విచారణ జరిపి తెలుసుకోవాలన్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారన్నారు.
విధులను సక్రమం గా నిర్వహించని పోలీసులపై డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని బీరం డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల సంస్కృతిని ఆపకపోతే చూస్తూ ఊరుకోబోమని బీరం హెచ్చరించారు. బాలూనాయక్ కుటుంబానికి ఎలాంటి హానీ జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తమ కార్యకర్తలకు న్యాయం జరగని పక్షంలో అవసరమైతే కోర్టును ఆశ్రయించి కాపాడుకుంటామన్నారు. కాగా, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ను కలిసి బీరం హర్షవర్ధన్‌రెడ్డి బాధితులకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాన్‌గల్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో పాన్‌గల్ మండల బీఆర్ఎస్ అద్యక్షుడు వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, రాజేశ్వర్‌రెడ్డి, నందిమళ్ల అశోక్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.