కొల్లాపూర్, ఫిబ్రవరి 23: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ పట్టణంలో తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్లో పనులు జరిగిన ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. హడావుడిగా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకుండా టార్గెట్‌తో ఒత్తిడి పెట్టి పని చేయించడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరితో ఉద్యోగాలు, కార్మికులు ప్రాణాలు కోల్పాయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పాడైనట్లు తెలిసినా ఎందుకు పనులు చేయించినట్లు అని ఆయన ప్రశ్నించారు. లూజ్‌గా ఉండే పై కప్పు ప్రాంతాన్ని రాడార్ లాంటి పరిజ్ఞానం వాడి గుర్తించకుండా సీపేజీ క్లియర్ చేయకుండా కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పనులు చేయించారన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. కోటి పరిహారం ఇవ్వడంతో వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించి రూ. 50లక్షల ఆర్థికసాయాన్ని అందించాలన్నారు. టన్నెల్ ప్రమాదంపై స్వతంత్ర కమిటీతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.