వీపనగండ్ల, ఏప్రిల్ 18 : ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిలాష్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన ఉద్యమ పార్టీ 25సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురష్కరించుకొని నిర్వహిస్తున్న రజతోత్సవ సభలో కేసీఆర్ ఇచ్చే స్పూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వినడానికి సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులను కోరారు.
ప్రతి గ్రామంలో ఈ నెల 27న తెల్లవారుజామున బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ఓరుగల్లు సభను విజయవంతం సేందుకు ఉద్యమ స్ఫూర్తితో కదిలిరావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ కమలేశ్వర్‌రావు, నాయకులు మల్లయ్య, రామేశ్వర్రావు, ఎండీ సర్ధార్, సురేందర్‌రెడ్డి, శివ, వేణుమాధవ రెడ్డి, సురేశ్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.