అచ్చంపేట, మే 15 : ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అడవుల్లో బ్యూటిఫుల్ బిట్టు ఉడుత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆసక్తికరమైన ఈ అందాల ఉడుత ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి పరిశోధకులను ఆకట్టుకుంటున్నది. ఆకర్షణీయమైన రంగులు, అసాధారణ పరిమాణం, చెట్లపై చురుకైన కదిలికలతో ప్రత్యేకతను చాటుకుంటున్నది.
బిట్టు ఉడుత పరిమాణం 25-40 సెం.మీ.వరకు ఉం టుంది. తోక పొడవుగా, దట్టంగా కనిపిస్తోంది. ఊదా, గో ధుమ, బూడిద రంగుల మిశ్రమంతో ఈ ఉడుత ఆకర్షణీయంగా కనబడుతున్నది. ముదురు నలుపు, బూడిద రంగుతో కూడిన తోక ఉంటుంది. పెద్ద ఉడుత జాతీకి చెందిన ఉడుతగా చెబుతున్నారు.
ఈ వన్యప్రాణి చెట్లపై జీవించే వృక్షవాసి. పగటిపూట చురుకుగా సంచరిస్తూ చెట్ల మధ్య వేగంగా దూకుతున్నది. ఆకులు, పండ్లు, పువ్వులు, విత్తనాలు, చిన్న, చిన్న పురుగులు తింటూ జీవిస్తుంది. బిట్టు ఉడుతలు చాలా అరుదు గా కనిపిస్తాయి. దేశపు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఈ జాతి రక్షిత జీవిగా చేర్చబడింది. నల్లమల అడవుల్లో దీని ఉనికి వన్యప్రాణి జీవవైవిద్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొంటారు. అడవుల పర్యావరణ సమతుల్యతకు ఈ ఉడుత ముఖ్యమైన భాగం. పర్యాటకులను ఆకర్షించే ఈ జంతువు ప్రకృతిలో ఆకట్టుకునే అందాన్ని మరింత వెలుగులోకి తెస్తోంది. నల్లమలలో వన్యప్రాణుల ఉనికి జీవవైవిద్యానికి బలమైన గుర్తింపుగా చెప్పవచ్చు.
నల్లమల ప్రాంతంలోని ఉమామహేశ్వరం ఆలయంలో భక్తులకు బిట్టుఉడుత దర్శనమిచ్చింది. ఆ ప్రాంతంలో దాదాపు 6 వరకు ఈ జాతి ఉడుతలు ఉన్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఆలయం ఎదుట ఉన్న చెట్టు నుంచి కిందికి దిగిన బిట్టు ఉడుతకు మొదట ఆలయ సిబ్బంది కొబ్బరి చిప్పను అందివ్వగా తీసుకోని తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. తరుచుగా చెట్టుపై నుంచి బిట్టు ఉడుత కొబ్బరి చిప్పకోసం కిందికి వస్తుందని, ఇచ్చిన వెంటనే తీసుకొని చెట్టుపైకి వెళ్లిపోతుందని ఆలయ సిబ్బంది తెలిపారు.