జడ్చర్లటౌన్, జూన్ 30 : బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని మాజీ మంత్రులు మహమూద్‌అలీ, డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. జడ్చర్లలోని వాసవి ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు, సర్ ప్రక్రియపై అవగాహనకు మాజీ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ గ్రామాల్లో తిరిగి ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలన్నారు.
అలాగే డిజిటల్ ఆన్లైన్ సభ్యత్వాల నమోదును ఉద్దేశించి వివరించారు. పాలమూరు జిల్లా ముద్దు బిడ్డ అంటూనే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిండని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. మూడేండ్లు కావస్తోన్నా జిల్లాలో ఎకరం భూమికి నీళ్లు ఇవ్వలేకపోయిండని విమర్శించారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు ప్రాజెక్టులు కడ్తున్నారని.. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు ఎలా వస్తాయని, శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడిన పాలమూరుకు నీళ్లు ఎలా వస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనంతో పాలమూరు జిల్లాకు అన్యాయమవుతున్నదన్నారు.
సర్‌పై అప్రమత్తంగా ఉండాలి : ఆర్ఎస్పీ

సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమ త్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మం గళవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బీఎల్వోతో కలిసి ఇంటింటికెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్యుమరేషన్ పత్రాలను సక్రమంగా నింపడంలో సహకరించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి ఇచ్చిన పత్రాలను నింపి బీఎల్వోకు ఇచ్చి రసీదు పొంది భద్రపరుచుకోవాలన్నారు. కుటుంబంలోని ఓటర్ల వివరాలను ఒకే చోట నమోదు చేసే ఫ్యామిలి మ్యాపింగ్ అత్యంత కీలకమని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆధార్‌లో ఉన్న వివరాలకు అనుగుణంగా పత్రాలను నింపాలని, అవసరమైన డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.