గద్వాల, ఫిబ్రవరి 6 : కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వే చేయకుండా బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండి పడుతున్నారు. ఏడాది ఏడాదికి జనాభా పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలు చెబుతూ తక్కువ చేసి చూయించేప్రయత్నం చేయడం సరికాదన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కటుంబ సర్వేతో పోల్చితే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కుల గణన సర్వేలో బీసీల జనాభా తగ్గించడమే కాకుండా ఓసీ జనాభా పెరిగినట్లు కుట్ర పూరితంగా తప్పుడు లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేను తక్షణమే రద్దు చేసి మళ్లీ పూర్తి స్థాయిలో సర్వేను నిర్వహిస్తే తప్పా బీసీలకు న్యాయం దక్కదన్నారు.
బీసీలను మోసం చేసేలా కాంగ్రెస్ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పథకం ప్రకారం బీసీలను అణగదొక్కేందుకే కుల గణన చేపట్టింది. శాస్త్రీయంగా లేని ఈ సర్వేలో అవసరం లేని 59 అంశాల గురించి ప్రస్తావించిందే తప్పితే బీసీలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం సర్వేలో కానరాలేదు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్రలో భాగంగానే ఈ సర్కారు సర్వే నిర్వహించింది. సర్వేను బీసీ సంఘాలు, కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు న్యాయం జరగాలంటే రాజకీయ ఉద్యమం అవసరం. ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకం కావాల్సిన అవసరముంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తేనే బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుంది. అలాగే, చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలి.
– ఏబీజే సత్యంసాగర్, సామాజికవేత్త, పెబ్బేరు
రీ సర్వే చేయాలి
బీసీలను అవమానపర్చేలా ఉన్న ఈ కులగణనను రీ సర్వే చేయాలి. బీహార్ రాష్ట్రంలో కులగణ చేస్తే అక్కడ ముఖ్యమంత్రి 26 సార్లు సమీక్ష సమావేశాలు చేస్తే ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క సమావేశం నిర్వహించడం అన్యాయం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికల నిర్వహిస్తామని చెప్పి ఆనాడు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు ఎదురు చూసిన బీసీల ఆశలపై నీళ్లు చల్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గ్రామ గ్రామానా బీసీలకు జరిగిన అన్యాయం, అవమానాలపై, ఈడబ్ల్యూఎస్‌తో జరుగుతున్న అన్యాయంపై కూడా పోరాటాలకు సిద్ధమవుతున్నాం.
– శ్రీనివాస్‌సాగర్ బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు పాలమూరు
సర్వే కాకి లెక్కలు..
రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే తప్పుల తడకగా, కాకి లెక్కలతో అశాస్త్రీయంగా చేసింది. పదేండ్లలో తెలంగాణ జనాభా 2లక్షలు మాత్రమే పెరిగిందని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో జరిపించిన సమగ్ర సర్వేలో బీసీ(ముస్లింలోని బీసీలు కాకుండా) 52శాతం అని నిర్ధారణ కాగా, ఇప్పుడు 46శాతమేనని 6శాతం తగ్గించి చూపడం దారుణం. బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే ఉద్దేశ్యం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. బీసీలపై కాంగ్రెస్‌కు చులకన భావం నెలకొన్నది. ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోం.
– బాసు హన్మంతు నాయుడు, బీఆర్ఎస్ నేత