కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణనపై బీసీలు భగ్గుమన్నారు. రాజకీయంగా అణచివేసేందుకు రేవంత్ సర్కారు కులగణన పేరుతో కుట్రలు పన్నుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతుండడంతో సర్వే పేరుతో మోసం చేస్తున్నదని మండిపడ్డారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన సమగ్ర సర్వేకు, కాంగ్రెస్ ప్రస్తుతం చేపట్టిన సర్వేకు ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు. రాష్ట్రంలో 56 నుంచి 60 శాతం బీసీ జనాభా ఉండగా, కేవలం 46 శాతం మాత్రమే ఉన్నారని, వివిధ వర్గాలను కలిపితే 55 శాతానికే పరిమితం చేసే కుయుక్తులు పన్నినట్లు ఆరోపించారు. ఈ వివరాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని దుమ్మెత్తిపోస్తున్నారు.
– మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 5
బీసీలను అణగదొక్కే కుట్ర..
రిజర్వేషన్ల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉన్నది. బీసీలను అణచివేసే ప్రయత్నంగానే కులగణన చేపట్టారు. రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51శాతం ఉన్న బీసీ జనాభా నేడు 46శాతానికి పడిపోయిందంటే కులగణన ఎలా చేశారన్నది అర్థమవుతున్నది.
సక్రమంగా సేకరించని వివరాలు
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గొప్పలు చెప్పుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ముసుగులో ఇటీవల ప్రజల్లోకి వెళ్లి తేల్చిన లెక్కల నివేదికలు తప్పులతడకగా ఉన్నాయి. 2014లో జరిపించిన ప్రకారం బీసీలు 51 శాతంగా తేల్చగా, జనాభా 1.85 కోట్లుగా నిర్ధారించారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ చేపట్టిన కులగణనలో 46 శాతంతో 1.64 కోట్ల జనాభా మాత్రమేనని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఉన్న జనాభాకు 5 శాతం తగ్గించి చూపడం దారుణమని, ఈ తప్పుల తడకల సర్వే నివేదికను అసెంబ్లీలో ఆమోదించి చట్టసభల్లో ప్రవేశపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ జనాభా.. మూడేండ్ల తర్వాత పెరగాల్సిందిపోయి.. తగ్గించడమేమిటని నిలదీశాయి. కులగణన లెక్కలు సక్రమంగా సేకరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాధన కోసం ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన బీసీలకు కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన కులగణనతో తక్కువ చేసి చూపడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసనలు వెల్లువెత్తాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం..
కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం అమలు చేసే ఉద్దేశం, బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేసే ఆలోచనలేదని కులగణన సర్వేలో తేలింది. తప్పులను వెంటనే సరిదిద్దాలని, ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని, కేబినెట్లో సముచిత స్థానం క ల్పించే వరకు పోరాడుతామని బీసీ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటివ్వకపోవడం, రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కులగణన పేరుతో బీసీలను తక్కువగా చూపించేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేసింది. సుమారుగా 20లక్షల మంది బీసీలు లెక్కలో లేకుండా పోయారు. సీఎం ఇందుకు సమాధానం చెప్పాలి. కులగణన ద్వారా లెక్కిస్తే ఓసీలు కేవలం 10శాతం మాత్రమే ఉంటారు. 15శాతం చేసి చూపించారు. బీసీలను చంపి ఓసీలను బతికిస్తారా? బీసీలను తక్కువ చేస్తున్న రేవంత్‌కు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం.
– బైకని శ్రీనివాస్‌యాదవ్, బీసీ నాయకుడు
కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదు
బీసీలకు 42శాతం రిజర్వేషన్ లేని సబ్‌ప్లాన్ లేని నివేదిక ఇది. కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో కోటీ 80లక్షలు జనాభా ఉంటే ఇప్పుడు కోటీ 60లక్షలకు ఎలా తగ్గింది. బీసీ వర్గాలకు కోలుకోలేని దెబ్బ. గణతంత్ర రాజ్యంలో గల్లంతైన గణంకాలతో బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది. బీసీ, ఎస్సీ జనాభాను తగ్గించి అగ్రకులాల జనాభాను పెంచారు. 8శాతం ఉన్న అగ్రకులాలు 5% శాతాపైగా పెరిగితే, 51శాతం ఉన్న బీసీలు, 18 శాతం ఉన్న ఎస్సీలను తగ్గించి చూపడం సిగ్గుచేటు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో బహుజనులను, మైనార్టీలను అణచి వేసేకుట్ర.
– మోహన్ బాబు, బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు