నారాయణపేట, అక్టోబర్ 6 : తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. వేడుకలను అధికారికంగా నిర్వహించకపోగా, స్వ చ్ఛందంగా నిర్వహిస్తుండగా కరెంట్ కోతలు విధించడం గమనార్హం. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. పల్లె నుంచి ప్రపంచంలోని వివిధ దేశాల్లో సైతం కనుల పండువగా వేడుకలను నిర్వహించేలా ఖ్యాతిని తీసుకొచ్చారు.
అంతేకాకుండా దసరా వేడుకలకు ముందు ప్రత్యేకంగా బతుకమ్మ చీరలను అందించి 8రోజుల పాటు వేడుకలు నిర్వహించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందించారు. నారాయణపేటకు ఎంతో చరిత్ర కలిగిన బారం బావిని గతంలో నారాయణపేట కలెక్టర్‌గా పనిచేసిన దాసరి హరిచందన శుభ్రం చేయించి విద్యుద్దీపాలతో అలకరింపజేసి 8రోజులపాటు ఆటాపాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎంతో ప్రత్యేకత కలిగిన పండుగ వేడుకలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. వేడుకలు ప్రారంభమై మూడు రోజు లు కావస్తున్నా ఊసేలేదు. 7వ తేదీన ఒక రోజు మాత్రం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ భర్త చంద్రకాంత్ తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పొచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిధుల లేమి కారణంగా గ్రామాలు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. కేసీఆర్ పాలనలో పట్టణాలతో సరిసమానంగా గ్రామాలు అభివృద్ధి సాధించాయి. గ్రామాల్లో ట్రాక్టర్లతో తడి, పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టా రు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పరిఢవిల్లింది. ఏటా బతుకమ్మ కోసం ఆయా ప్రాంతాలను ప్రత్యేకంగా శుభ్రం చేసేవారు.
దీంతో మంచి వాతావరణంలో బతుకమ్మ నిర్వహించేవారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. కనీసం పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు కూడా నిధులు లేని పరిస్థితి దాపురించింది. ఈ క్ర మంలో మహిళలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా శు భ్రం చేసుకొని బతుకమ్మ ఆడుతున్న దుస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంత మహిళలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ వివక్షను దుయ్యబడుతున్నారు.
పరిపాలించడానికి చేతగాని ముఖ్యమంత్రికి రాష్ట్ర పండుగలపై కూడా సోయి లేదు. తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు బతుక మ్మ పండుగ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నది. అలాంటి పండుగను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదు.
– లక్ష్మి, మాజీ ఎంపీటీసీ, కొమ్మూరు, గుండుమాల్ మండలం
పదేండ్లు బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. కేసీఆర్ సారు ఆడపడుచులకు చీరలు కూడా ఇస్తుండె. రేవంత్‌రెడ్డి సీఎం అయినంక బతుకమ్మ పండగకు కళ తప్పింది. మహిళలంటే సరార్కు ఎందుకు ఇంత చిన్నచూపు. అధికారం కోసం గొప్పలు చెప్పి ఉన్న పండుగలకు కూడా ప్రాధాన్యత ఇస్తలేరు.
– గౌని సురేఖారెడ్డి, మాజీ జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్, నారాయణపేట జిల్లా
బతుకమ్మ పండుగకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 18ఏండ్లు నిండిన మహిళలందరికీ చీరలను పంపిణీ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వేడుకలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచి విదేశాల్లోనే బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుండగా, మన పండుగైన తెలంగాణ లోనే వేడుకలను నిర్వహించకుండా అవాంతరాలు సృష్టించడం బాధాకరం.
– లలిత, మాజీ స్త్రీ శిశు సంక్షేమశాఖ సభ్యురాలు, మక్తల్, నారాయణపేట జిల్లా