టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కర్షకుల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు జరిగాయి. సమావేశాలకు రైతులు దండులా కదిలొచ్చారు. కాంగ్రెస్ చీప్ పాలిట్రిక్స్‌ను ఎండగట్టారు. ఆ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. రైతుల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ముక్తకంఠంతో హెచ్చరించారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని, ఆయన వల్లే నేడు వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. అచ్చంపేట మండలం పులిజాలలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నారాయణపేట జిల్లా సింగారం, కోయిలకొండలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఇటిక్యాల మండలం షాబాదలో ఎమ్మెల్యే అబ్రహం, ధరూర్ మండలం చింతరేవులలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ఎదుర్కొన్న కష్టాలు, చేసిన ఆందోళనలను వారు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నదని తెలిపారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూలై 18
ధరూరు, జూలై 18 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులుగా ప్రశాంతంగా సాగు చేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్య బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడుగంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు కరెంట్ కోత లేకుండా సాగునీరిచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. సాగుకు మూడుగంటల కరెంట్ చాలు అన్న రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మండలంలోని చింతరేవుల రైతువేదికలో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. సర్పంచ్ శిల్ప అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రైతులు ఎమ్మెల్యేకు డోలు చప్పుళ్లతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడుగంటలతో మూడు బారుల పొలం కూడా తడపలేమని.. రైతు బంధు లేకుంటే రైతుకు తిప్పలు తప్పవన్నారు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ధాన్యమంతా దళారుల పాలవుతుందని వివరించారు.
రాష్ట్రంలో రెండు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అందులో ఒకడికి మతపిచ్చి, మరొకడికి కార్పొరేట్ కమీషన్ల పిచ్చి. వీటిలో ఏది అధికారంలోకి వచ్చినా దేశం సర్వ నాశనం అవతుందని విమర్శించారు. 60ఏండ్ల పాలనలో రైతులకు ఒక్క మంచి పథకమైనా తెచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగుకు సకల సౌలతులు కల్పించిన ప్రభుత్వం వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ పద్మ మాట్లాడుతూ మూడుగంటల కరెంటుతో ఏ రైతు అయినా సాగు చేస్తాడా? ఏ పంట పండించాలో కాంగ్రెసోళ్లే చెప్పాలన్నారు. ఆరుగంటల కరెంటుకే నానా అవస్థలు పడ్డాం, ఇక మూడుగంటల కరెంటిస్తే సాగు ఇడిసి ముంబయి పోయొస్త తల్లి మాయమ్మ అనే పాట పాడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా రైతు పథకాలు కొనసాగాలి, 24 గంటల కరెంట్ ఉండాలి, తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంటుందని పలువురు రైతులు ముక్త కంఠంతో చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నీసాబేగం, కౌన్సిలర్ నరహరిగౌడ్, జములమ్మ ఆలయకమిటీ చైర్మన్ సతీశ్, పెద్దపాడు సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సల్లంగుండాలి
రైతులను కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సల్లంగుండాలి. గతంలో రైతులను పట్టించుకునేటోళ్లు లేరు. ఏ గవర్నమెంట్ కూడా రైతుల గురించి ఆలోచించలేదు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మా బతుకుల్లో మార్పు వచ్చింది. పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి. పెట్టుబడికి రైతుబంధు ఆసరగా మారింది. రైతుబంధు, రైతుబీమా రైతులను ఆదుకుంటున్నాయి. భూములకు విలువ పెరిగింది. కాంగ్రెసోళ్లు రైతులకు ఉచిత కరెంటు ఎందుకని మాట్లాడడం టీవీల్లో చూస్తున్నాం. వారిని ఎవ్వరూ నమ్మరు. వారి పాలనలో కరెంటు ఉండదు, ఎరువులు, విత్తనాలు దొరకవు, నీళ్లు లేక చాలా గోస పడ్డాం. కరెంటు ఎప్పుడోస్తుందో తెలియదు. కరెంటు కోసం పొలాల్లో జాగారం చేసేటోళ్లం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా.. కరెంటు సరిపడక పంటలు ఎండిపోయేటివి. ఇప్పుడు కరెంటు 24గంటలు ఉండడంతో మాకు అవసరమున్నప్పుడు పొలానికి వెళ్లి నీరు పడుతున్నం. రాత్రి పూట పొలానికి వెళ్లే ఇబ్బందులు తప్పాయి. మళ్లీ కేసీఆర్ సారే గెలుస్తడు.
– బోడ నారాయణ, సింగారం, అచ్చంపేట మండలం
కరెంటు చిచ్చు పెట్టింది కాంగ్రెస్సే..
24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ లేని పోని అబాండాలు ఏస్తుంది. నేను పెద్ద సదువులు సదువుకోలేదు. మేము సదువుకునే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఏమో చేస్తది అనే నమ్మకం ఉండేది. సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేస్తుండు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండు. గతంలో రాత్రిళ్లు జాగారం చేసి పొలాలకు నీరు పారిచ్చుకునేటోళ్లం. కేసీఆర్ పుణ్యమా అని ఇప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు వస్తోంది. కాబట్టి పగటి పూటనే పొలానికి నీరు పారిస్తున్నం. కరెంట్ చిచ్చు పెట్టిందే కాంగ్రెసోళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు చాలా బాగున్నాయి. అలాంటి ప్రభుత్వంపై అబాండాలు వేయడం సరికాదు.
– పద్మావతి, మహిళా రైతు, షాబాద
సెలకాలతో వాతలు పెట్టినా నా కోపం తెగదు..
మూడుగంటల కరెంట్ వ్యవసాయానికి సాలు అన్న రేవంత్‌రెడ్డిని గొడ్డును కొట్టే సెలకాలతో కొట్టినా నా కోపం తెగదు. ఇప్పుడున్న ప్రభుత్వం తక్కువ కాలంలో సాగునీటి ప్రాజెక్ట్‌లు కట్టి, చెరువులు నింపి, 24 గంటల కరెంట్ ఇచ్చింది. కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్యం కొని మా ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వంపై అడ్డమైన మాటలు మాట్లాడితే గుడ్డలూడదీస్తాం బిడ్డా రేవంత్. రైతుల ఉసురు పోసుకోవద్దు. చెత్త ఊడ్సుకుపోయినట్లు పోతవ్. మా జోలికి, కేసీఆర్ ప్రభుత్వం జోలికొస్తే నీకు.. నీ కాంగ్రెస్‌కు కంతలు పగుల్తవి. ఇప్పుడు సాగు సంబురంగా చేసుకుంటున్నం. అది ఏ రైతునడిగినా చెప్తడు. నీ కార్యకర్తలను అడిగినా అదే చెప్తరు. మేలు పొందిన రైతులు ఎప్పుడూ అబద్ధం చెప్పరు.
– తిరుపతిరెడ్డి, రైతు, చింతరేవుల
మా పొలం కాడికి రా.. సాగు ఎట్టా ఉంటదో చూపిస్తా..
రేవంత్‌రెడ్డి మా పొలం కాడికొస్తే సాగు అంటే ఏమిటో నేర్పిస్తా. నాకు పదెకారాల పొలం ఉంది. మూడు గంటల్లో ఎకరా పొలం తడుస్తుందా? ఏ రేగడిలో ఒక తడి పారిస్తే పదును ఎన్నిరోజులు ఉంటదో తెలుసా? ఇష్టమొచ్చినట్లు రైతులపై రోతకూతలు కూస్తే ఎట్లా రేవంత్? స్వాతంత్య్రం వచ్చినంక 75 ఏండ్లల్లో మమ్మల్ని సల్లంగ చూసింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. మీ పాలనలో మేం అప్పుల పాలై అవస్థలు పడ్డాం. పెట్టుబడికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? కేసీఆర్ ఎకరాకు రూ.పదివేలు ఇస్తున్నాడు. మీరు మాత్రం మంచి చేస్తున్న ప్రభుత్వం మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము మంచిగా వుంటాం. మా సాగు సంబురంగా ఉంటది.
– గడ్డల ఆంజనేయులు, రైతు, చింతరేవుల
మూడుగుంటలు కూడా తడపలేం..
మూడుగంటల కరెంటుతో మూడుగుంటల భూమి కూడా తడపలేం. ఎకరా భూమిని దున్నేందుకు రాత్రి, పగులు తడపాలి. డ్రిప్‌తో కూడా ఎకరా భూమిని మూడుగంటల్లో తడపలేం. రైతులపై ప్రతిపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతారు. సాగు అంటే అంత చులకన అయిపోయిందా రేవంత్‌రెడ్డి?. మీ తాతలు, మీ అయ్య వ్యవసాయం చేసినారా? ఒక్కసారి వాళ్లను అడుగు. నువ్వైతే పొలం గట్టు మీద కూడా నడిసి ఉండవు. పొలం, సాగు గురించి తెలిసుంటే ఇట్ల మాట్లాడవు. రైతులకు క్షమాపణ చెప్పు, లేదంటే నువ్వు, నీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.
– తిమ్మారెడ్డి, రైతు, చింతరేవుల
బోజల్లో పడుకునే వాళ్లం
గతంలో కరెంటు కష్టాలు అన్నీ.. ఇన్ని కాదు. పొలాల్లో నీరు పెట్టేందుకు పోతే కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. రాత్రిళ్లు నీరు పారించేందుకు వెళ్తే పొలంలో ఏర్పాటు చేసుకున్న బోజల్లో(సాళ్లు) పడుకునే వాళ్లం. ఒక బోజలో పడుకుని మరో బోజలో కాళ్లు పెట్టి పడుకునేటోళ్లం. కరెంటు వచ్చి నీళ్లు పారినప్పుడు తడి కాళ్లకు తగిలగానే లేచి పని చూసుకునే వాళ్లం. రోజుకు ఆరు గంటల కరెంటు కూడా ఇచ్చే వారు కాదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో మాకు ఏం ఇబ్బందులు లేవు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను మాకు ఇస్తున్నడు. కాంగ్రెసోళ్ల మాటలు రైతులకు మేలు చేయవు. మూడు గంటల విద్యుత్‌తో ఎవుసం చేయలేం.
రాత్రిళ్లు నిదుర లేకుండే..
కాంగ్రెస్ పాలనలో 7 గంటల కరెంట్ కూడా సక్రమంగా రాకుండే. ఎన్నో రాత్రుళ్లు జాగారం చేశాం. కేసీఆర్ పాలనలో 24గంటల విద్యుత్ అందుతున్నది. అందువల్లనే మూడు పంటలు సాగు చేస్తున్నాం.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలని అంటరు. కర్ణాటకలో 6 గంటలే ఇస్తున్నరు.
– నాగయ్య, రైతు, కానాయపల్లి