హన్వాడ, జూలై 11 : రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు, సాగునీళ్లు, ధాన్యం కొనుగోలు ఇలా ఏ విషయంలోనూ లోటు లేకుండా అన్ని విధాలుగా రైతులకు వెన్నుదన్నులా నిలిచారన్నారు. కాంగ్రెస్ సర్కారొచ్చాక రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చని పంటలు, సాగునీళ్లతో భూముల ధరలు పెరిగి రైతులు రాజులుగా మారారన్నారు. నేడు వచ్చిన నీటిని ఒడిసిపట్టుకోలేక, పంటలెండి రైతును దివాలా తీయించేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రూ.4వేల పింఛన్, తులం బంగారం, మహిళలకు రూ 2,500 ఇలా 420 హామీలిచ్చి ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేని అసమర్థ స్థితిలో రేవంత్‌రెడ్డి సర్కారు ఉన్నదన్నారు. అధికారంలోకి వచ్చి 18నెలలు గడిచి నా వాటి ఊసే లేదన్నారు. రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. చేతగాని ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అ సెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాల హామీలతో, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తనను ఓడించారని, అయినా ఎవరి పరిపాలన ఎటువంటిదో ప్రజలకు అర్థమవుతున్నదన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. గ్రామాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ కొ త్తగా చేసిందేమీ లేదన్నారు. అధికారం లేకపోయినా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు.
ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎల్లప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుందని చెప్పారు. అనంతరం మునిమోక్షం గ్రామానికి చెందిన 10మంది బీఎస్పీ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి శ్రీనివాస్‌గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తకు సంబంధించిన ఫొటోస్టుడియోను ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, కార్యదర్శి శివకుమార్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మా జీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ జెడ్పీటీసీ నకేందర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, చెన్నయ్య, బసిరెడ్డి, ఖాజాగౌడ్, అనంద్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.