సిటీబ్యూరో, 27 (నమస్తే తెలంగాణ): నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు సహకరిస్తున్న ఒక ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో జూబ్లీహిల్స్ మరంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ కథనం ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన జవ్వాద్ ఖాద్రీ రిఫాయి, మహమ్మద్ నౌషాద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చేందుకు పథకం పన్నారు.
ఇందులో భాగంగా స్థానికంగా ఒక షట్టర్‌ను అద్దెకు తీసుకుని, స్టార్ అగ్రో ఇండస్ట్రీస్ పేరుతో నకిలీ అద్దె ఒప్పందాలు, తప్పుడు వ్యాపార పత్రాలను సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ద్వారా జూబ్లీహిల్స్‌లోని మరంటైల్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ పాముల ప్రణవరాజ్, బ్రాంచ్ మేనేజర్ శంకర్ రాథీ సహకారంతో కరెంట్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అక్టోబర్ 2025లో ఈ ఖాతా ద్వారా సుమారు రూ.6.67 లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను పక్కా సమాచారంతో ఈనెల 26న అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీసీపీ వివరించారు.
మరంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జూబ్లీహిల్స్ శాఖలోనే దాదాపు 30కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిచినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. బ్యాంకు సిబ్బంది నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైన బాధితులు సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని డీసీపీ ప్రజలకు
సూచించారు.