వరంగల్, ఫిబ్రవరి 27 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు రద్దు కానున్నాయా..?, ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని పేదల కోసం 8,734 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించింది. ఇందులో 5,922 మందికి మంజూరు పత్రాలు అందజేయగా, వారిలో కేవలం 3,029 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. మిగతా సగంమంది ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. ప్రభుత్వ కఠిన నిబంధనలు, బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులపాలవుతామన్న ఆందోళనతో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. కాగా, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణం ప్రారంభించని ఇండ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇందిరమ్మ ఇండ్లు సగం రద్దు కానున్నాయి. మంజూ రు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టకుంటే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 45 రోజు ల్లో ముగ్గు పోయాలన్న నిబంధన స్పష్టంగా ఉన్నది. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 5,922 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయగా, వారి లో సగంమంది ఇప్పటికీ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. దీంతో అధికారులు నిర్మాణం ప్రారంభించని ఇండ్ల ను గుర్తించి రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే వందల ఇండ్లను నాట్‌విల్లింగ్ పేరుతో రద్దు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో చాలామంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు భయపడుతున్నారు. ఇళ్లు మంజూరైందన్న సంబురం ఒకవైపు.. ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలు సరిపోక అప్పులపాలవుతామన్న భయం మరోవైపు లబ్ధిదారులను వెంటాడుతున్నది. దీంతో నెలలు గడుస్తున్నా మంజూరు పత్రాలు అం దుకున్న లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేందుకు జంకుతున్నారు.
పట్టణ ప్రాంతమైన గ్రేటర్ పరిధిలో 3వేల మంది కి పైగా లబ్ధిదారులు ఇప్పటివరకు నిర్మాణాలు మొదలు పెట్టలేదు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు పరకాల నియోజవర్గానికి చెంది న 3 డివిజన్లు, వర్ధన్నపేటకు చెందిన 13డివిజన్లు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన రెండు గ్రామా లు, ఒక డివిజన్ ఉన్నాయి. మొత్తం 66 డివిజన్లకు 8,734 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం కేటాయించగా, అందులో 5,922 మంది లబ్ధిదారులకు కలెక్టర్లు మంజూ రు ప్రతాలు అందజేశారు. అయితే, ఇందులో సగం మం ది ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టలేదు.
కేవలం 3,029 మంది మాత్రమే ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. మిగతా లబ్ధిదారులు మొదలు పెట్టాలా.. వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. కాగా, అధికారులు మా త్రం నిర్మాణాలు ప్రారంభించని వాటిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ ప్రత్యేకంగా గ్రేటర్ కార్పొరేషన్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి నాట్ విల్లింగ్ పేరుతో మంజూరును రద్దు చేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. 400 నుంచి 600 ఎస్ఎఫ్ టీ లోపు మాత్రమే ఇండ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో చాలామంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల తో ఇంటి నిర్మాణం పూర్తి కాదు. అప్పు చేసి పెద్దగా ఇంటి నిర్మాణం చేసుకుంటామంటే ప్రభుత్వ నిబంధనలు అడ్డువస్తున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. దీనికితోడు బిల్లులు వస్తాయో? రావో అనే అనుమానాలతో చాలామంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంపై ఊగిసలాడతున్నారు.
ఇదిలా ఉండగా, ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు సకాలంలో బిల్లులు అందక ఇబ్బందిపడుతున్నారు. ప్రారంభించిన 3,029 ఇండ్లలో బేస్మెంట్ లెవల్లో 2209, ఇందులో రూఫ్లెవల్లో 1273 ఉం డగా, 118 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే, లబ్ధిదారుల్లో కొందరు అప్పులు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు బిల్లులు రాక పోవడం గమనార్హం. రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం గగ్గలంగా మారిన తరుణంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.