వేగం కన్న.. ప్రాణం మిన్న
వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని చూస్తున్న పోలీసులకు సెల్‌ఫోన్ డ్రైవింగ్
- నిర్లక్ష్యం.. పెను ప్రమాదం
- సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్
- మనిషి వాహనంపై.. మనసు ఫోన్లో..
- కొంపముంచుతున్న రాంగ్‌రూట్ ప్రయాణం
- హెల్మెట్ ధరించడం తప్పనిసరి
పెబ్బేరు, మే 16 : వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని చూస్తున్న పోలీసులకు సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్, నిర్లక్ష్య చోదనం తలనొప్పిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలు కోల్పోయి కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు తీరని దుఃఖం మిగులుస్తున్నారు. ఇటీవల సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్, నిర్లక్ష్య చోదనం, హెల్మెట్ లేకుండా వాహనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. సెల్ఫోన్లో మనసు పెట్టి వాహనాలు నడుపుతుండడంతో పక్కనా, ముందు ఎవరొస్తున్నారో గమనించే అప్రమత్తత తక్కువగా ఉంటుంది. చాలామంది ఇయర్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడుతుంటారు. మరికొందరైతే ఫోన్ ఒక చేతిలో, స్టీరింగ్ లేదా హ్యాండిల్ మరో చేతితో పట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటారు. దాదాపుగా 35 ఏండ్లలోపు వాహనదారులే ఇలా కనిపిస్తున్నారు.
రాంగ్రూట్లో ప్రమాదకరం
యూటర్న్ దూరంగా ఉండటంతో వాహనదారులు రాంగ్రూట్లో వాహనాలు నడుపుతూ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం వెళ్లే సమయం, పెట్రోల్ వృథా అవుతుందని చాలామంది రాంగ్రూట్లో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చేవారు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.. మహిళలు, పిల్లలను సైతం వాహనాలపై ఎక్కించుకొని రాంగ్‌సైడ్‌లో వెళ్తున్నారు. బైక్‌పై ముగ్గురు, అంతకంటే ఎక్కువగా రాంగ్రూట్లో అతివేగంతో దూసుకెళ్తున్నారు.
హెల్మెట్ తప్పనిసరి
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువశాతం ద్విచక్రవాహనాదారులు తలకు గాయాలై మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలు కాపాడటంలో హెల్మెట్ పాత్ర సింహభాగమని గుర్తించాలి. మన ప్రయాణం ఎంత తక్కువ, దూరమైనా హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. వెంట్రుకలు ఊడిపోతాయని, దువ్వుకున్న క్రాప్ చెడిపోతుందని, బైక్‌పై వెళ్తుంటే అందరూ తన వైపే చూడాలని చాలామంది యువకులు హెల్మెట్ ధరించడం లేదు.
నిబంధనలు పాటిద్దాం..
- సరదా కోసం అతివేగం వద్దు.
- వాహనాదారులు ఓవర్టేక్ చేశారనే అహం వద్దు.
- బైక్‌పై ఇద్దరికి మించి ప్రయాణం చేయొద్దు.
- మలుపుల వద్ద ఓవర్టేక్ వద్దు.
- యూటర్న్ తీసుకున్నప్పుడు వెనుక, ముందొస్తున్న వాహనాలను గమనించాలి.
- పిల్లలు డ్రైవింగ్ చేయొద్దు. లైసెన్స్ లేని వారు రోడ్లపైకి వాహనాలతో రావొద్దు.
- రోడ్ల చుట్టుపక్కన ఉన్న గుర్తులు, సంకేతాలు పాటిస్తూ వాహనం నడపాలి.
- మద్యంతాగి వాహనాలు నడుపొద్దు.
- సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి.
- అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే.. వేగంగా వెళ్లొద్దు. ముందే ప్రయాణం ప్రారంభించాలి.
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
వాహనాదారులు వాహనాలు నడుపుతున్న సమయంలో నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడితే ఏకాగ్రత దెబ్బతిని వాహనంపై పట్టు తగ్గే అవకాశం ఉంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నుంచి కింద పడితే నేరుగా తలకు గాయాలవుతున్నాయి. చాలామంది మృత్యువాత పడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. జిల్లాలో ఎస్పీ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్, మద్యం సేవించి, మైనర్, రాంగ్‌రూట్, ధ్వని కాలుష్యం, త్రిబుల్ రైడింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. ఈ-చలాన్ విధానంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రామస్వామి, ఎస్సై, పెబ్బేరు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

