సిటీబ్యూరో, ఆగస్ట్ 18 (నమస్తే తెలంగాణ) : హెచ్‌ఫాస్ట్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అక్రమంగా కల్తీనెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై భారీ స్తాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడిపదార్థాలు, ప్రమాదకర రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగర సీపీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం టీజీఐసీసీసీలో కల్తీ నెయ్యి తనిఖీలకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ తనిఖీల్లో మొత్తంగా 130 సంస్థలను పరిశీలించామని, వాటిలో 39 నెయ్యి తయారీ కేంద్రాలు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీనెయ్యి, 8.7టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600లీటర్ల వనస్పతి డాల్డా సహా మొత్తం దాదాపు 36 టన్నుల కల్తీనెయ్యి, తయారీ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
స్కిమ్డ్ మిల్క్, క్రీమ్, పామాయిల్, వనస్పతి, గంజి, బొంబాయి రవ్వ, తదితర పదార్థాలను కలిపి నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం దానిని ఆవు నెయ్యి, దేశీనెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కల్తీనెయ్యిని ఫంక్షన్లలో ఉపయోగించడంతోపాటు ప్యూర్ నెయ్యితో తయారు చేసిన స్వీట్లు అని చెప్పి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఈ నెయ్యి వాడుతున్నారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి క్రీమ్‌ను తీసుకొచ్చి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారని, ఈ నెయ్యి ప్యాకెట్లపై ఎలాంటి లేబుల్స్ లేవని, తయారీదారు, తేదీ, గడువుతేదీ, కంపెనీ వివరాలు కూడా లేవని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపించినట్లు తెలిపారు.
నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగించే ఆర్ఎం వాల్యూలో మార్పులు కనిపించాయని సీపీ వెల్లడించారు. పామాయిల్ కలపడం వల్ల ఈ విలువ పెరగడం, వనస్పతి వంటి పదార్థాలతో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, కల్తీ నెయ్యి వినియోగం వల్ల గుండెసంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నెయ్యి తయారీకి ఫ్లేవర్ బాటిళ్లను కూడా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలపై టీజీ సేఫ్‌తో సమన్వయం చేసుకుని మరిన్ని దాడులు నిర్వహిస్తామని, తెలంగాణను కల్తీ ఆహారం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి తయారీ, సరఫరా వెనక ఉన్న వ్యక్తులు, సంస్థలపై దర్యాప్తు కొనసాగుతున్నదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.