కంప్యూటర్లలో వ్యూహాలు, పేపర్లపై మ్యాపులతో నెలరోజుల కసరత్తు చేసిన ట్రాఫిక్ పోలీసు విభాగానికి ఆ వ్యూహాలన్నీ విఫలమైనట్లు ఒక్క రోజులోనే తేలిపోయింది. కేబీఆర్ వద్ద వన్‌వే అమలు చాలా సులువని భావించిన అధికారులు సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా అమల్లోకి తేవడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. లేన్చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లపై అవగాహన కల్పించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనెక్టింగ్ రూట్లలో ట్రాఫిక్ స్తంభించడంతో ఈ పరిస్థితి మెయిన్రోడ్లపై పడి పరిస్థితి అధ్వానంగా మారింది. కేబీఆర్ పార్కు చుట్టూ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి వన్‌వే అమలులోకి వచ్చిన సందర్భంలో కనిపించిన దుస్థితి ఇది.
– సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఆగస్ట్ 18 (నమస్తే తెలంగాణ)
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్రూట్లో వెళ్తే వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. కొందరేమో చలాన్లు వేస్తామంటూ చెప్పడంతో వాహనదారులు వారితో గొడవకు దిగారు. అడుగడుగునా ఇబ్బందులతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఎప్పుడు ముందుకు కదులుతామోనంటూ వేచిచూడాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా పోలీసులు రెండు సార్లు ట్రయల్న్ల్రు నిర్వహించినప్పటికీ ఎప్పుడు సమస్యలు వస్తాయో గమనించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ట్రయల్న్ ఆదివారాల్లో జరగడంతో వర్కింగ్‌డేస్‌లో వచ్చే వాహనాల రద్దీపై సరైన అంచనాలు వేయలేకపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్డు నంబర్ 5 వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు నంబర్ 10 సీ నుంచి రోడ్డు నంబర్ 5 వరకు వాహనాల రద్దీ కనిపించింది. రోడ్ నంబర్ 45, అగ్రసేన్, వెంకటగిరి వద్ద కొన్ని ఇబ్బందులు వచ్చాయి.
వన్‌వే ట్రాఫిక్ అమలుతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. యూసుఫ్‌గూడ, వెంకటగిరి నుంచి రోడ్డు నంబర్ 36 లోని జూబ్లీ చెక్‌పోస్టు, మెట్రోస్టేషన్, పెద్దమ్మగుడి తదితర ప్రాంతాలకు మధ్య కేవలం ఒకటిన్నర కిలోమీటరు మాత్రమే దూరం ఉంది. అయితే ఆరోడ్లో ట్రాఫిక్‌ను అనుమతించకపోవడంతో వారంతా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2, కేబీఆర్‌పార్కు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్, సీవీఆర్ చౌరస్తా, జర్నలిస్ట్ కాలనీ, రోడ్డు నంబర్ 45 జంక్షన్ మీదుగా ఏడుకిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబీఆర్ ప్రధాన గేటు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రివైపు ఉదయం వాహనాలు వన్‌వే పద్ధతిలో అనుమతించారు.
అయితే రోడ్డు నంబర్ 10, 14 వైపునకు వెళ్లే వాహనాలు కుడివైపు నుంచి ఎడమవైపునకు తిరగాల్సిన స్టడీసర్కిల్, క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా వద్ద అనుకూలమైన పరిస్థితి లేకపోవడంతో వారంతా అదే రోడ్డుపై ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి రోడ్డు నెంబర్ 12 వైపు వెళ్లే వాహనాలన్నీ కేబీఆర్ పార్కు వద్దే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడడంతో సుమారు రెండుగంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మసాబ్‌ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలు రోడ్ నంబర్ 12 వద్ద పెద్ద ఎత్తున జామ్ అవడంతో గమ్యం చేరడానికి రెండు మూడు గంటల సమయం పట్టిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వన్‌వే ప్రభావం రోడ్ నంబర్ 12 నుంచి అగ్రసేన్ చౌరస్తా దాకా తీవ్రంగా ప్రభావం పడింది.ఈ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు వాహనాలను బస్తీలు, కాలనీలను కలిపే రోడ్లపైకి మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక నగరవాసులు ప్రత్యక్ష నరకం చూశారు.

కేబీఆర్ చుట్టూ వన్‌వే విధానం అంటూ నెలరోజుల నుంచి ఊదరగొట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ప్రధాన రహదారులపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో ఆ రోడ్లకు అనుసంధానమైన అంతర్గత రోడ్లను నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. వెంకటగిరి, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ, ఇందిరానగర్, పంజాగుట్టల వైపు నుంచి చెక్‌పోస్టు, మాదాపూర్ , రోడ్డు నంబర్ 45 దుర్గం చెరువు, మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనదారులు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆఫీసులకు వెళ్లేందుకు ఆలస్యమవుతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేయడం కనిపించింది.
తమ లాగిన్ టైమ్ దాటిపోయి గంట దాటిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్బీటీనగర్, ఎమ్మెల్యే కాలనీ, సింగాడికుంట, ఉదయ్‌నగర్, గౌరీశంకర్నగర్ తదితర ప్రాంతాల మీదుగా రోడ్డు నంబర్ 2 వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయా ప్రాంతాల వాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒకవైపు గుంతల రోడ్లు, రెండోవైపు వెల్లువలా వస్తున్న వాహనాలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చెక్‌పోస్టు వరకు వచ్చి రాంగ్రూట్లో మళ్లీ వెనక్కు తిరిగి వెళ్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకుని మళ్లీ వెనక్కి పంపించారు. అంతేకాకుండా ప్రజలకు కేబీఆర్ పార్కు వద్ద పరిస్థితిని వివరించడంతో పాటు వన్‌వేపై అవగాహన కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొదట్లో ఈ ఇబ్బందులు తప్పవని, ఒకట్రెండుసార్లు సమస్య ఎదుర్కొంటేనే తర్వాత సెట్ అవుతారంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి ట్రాఫిక్ ఇబ్బందులపై వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రజలు ట్రాఫిక్ అడ్వైజరీని పట్టించుకోవడం లేదంటూ సీపీ సైతం ప్రజలనే నిందించడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉదయం ఆరుగంటల నుంచి అమల్లోకి వచ్చిన వన్‌వే విధానాన్ని చక్కబెట్టేందుకు కేబీఆర్ చుట్టూ వివిధ పోలీసు స్టేషన్ల నుంచి వచ్చిన సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. మొత్తమ్మీద ఉదయం రద్దీ సమయాన్ని అపసోపాలు పడుతూ దాటించేశాం అనుకున్న ఆనందం సాయంత్రానికి ఆవిరైపోయింది. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు కొంత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్లుగా భావిస్తున్న సమయంలోనే సాయంత్రం రద్దీ వారికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా దుర్గం చెరువు వైపు నుంచి వేలాది వాహనాలు సాయంత్రం ఐటీ కారిడార్ నుంచి రోడ్డు నంబర్ 45 మీదుగా రావడంతో బాలకృష్ణ నివాసం వద్ద మరోసారి అయోమయం నెలకొంది. ఈ వాహనాలు ఒకవైపు .. ఫిలింనగర్ నుంచి వచ్చే వాహనాలు మరోవైపు.. ఎటుచూసినా ఆ జంక్షన్‌లోనే జామ్ కావడంతో పోలీసులు తలపట్టుకున్నారు.
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సీవీఆర్, జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ల నుంచి నేరుగా చెక్‌పోస్టు వైపు కుడివైపు లేన్‌లో అనుమతించాలని భావించారు. అయితే పలువాహనాలు ఎడమవైపు నుంచి రావడంతో 45 రోడ్డు మీదుగా హాట్కప్ దాకా వెళ్లి తిరిగి యూటర్న్ చేసుకుని రావల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటికే ఆరు కిలోమీటర్లు తిరుగుకుంటూ వచ్చిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులపై ఫైరయ్యారు. జూబ్లీహిల్స్ వైపు నుంచి పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ వెళ్లాల్సిన వాహనాలు కేబీఆర్ పార్క్ మెయిన్ గేటు నుంచి పంజాగుట్ట చేరుకునేందుకు గంటకుపైగా సమయం పట్టింది. ముఖ్యంగా ఎల్వీ ప్రసాద్ ముందు బాటిల్ నెక్ దాటడం కష్టంగా మారింది. సాగర్ సొసైటీ, టీవీ9 చౌరస్తాపై విపరీతమైన భారం పడడంతో ఆ రూట్లలో రాత్రి పదిన్నరవరకు వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు.