ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదలైంది.. టీడీపీ దుకాణం పూర్తిగా మూతబడింది.. వరుసగా కారెక్కుతున్న నేతలతో గులాబీ పార్టీ గుబాళి స్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయి. మొన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి.. నిన్న నాగం జనార్దన్‌రెడ్డి, పీ.చంద్రశేఖర్, ఎర్రశేఖర్ బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపులో పార్టీని నమ్ముకొని ఉన్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించడంతో అసమ్మతి భగ్గుమన్నది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ పలువురు బయ టకు వచ్చారు. మరికొందరు వారి వారి అనుచరవర్గాలతో సమావేశాలు నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సోమ వారం పాలమూరు డీసీసీ కార్యాలయంపై దాడి జరిగింది. దేవరకద్ర సీటు ప్రదీప్గౌడ్కు కేటాయించకపోవడంతో అతడి అనుచరుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకున్నది. ఇలా ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరగగా.. బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా సమీకరణాలు మారుతున్నాయి.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు అనుకూలం అనుకున్న నియోజకవర్గాలు విపక్షాలకు పరీక్షగా మారాయి. కాంగ్రెస్ మొదటి రెండు జాబితాలో టికెట్ ఆశించిన వారికి పరాభవం ఎదురైంది. టికెట్లు దక్కని నేతలు పార్టీ అధినేతలపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ధాటికి బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వస్తారని భావించిన ఆ పార్టీ నేతలకు షాక్ ఇస్తూ కారు ఎక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ముఖ్యమంత్రి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ అయిపోయింది. అదే బాటలో నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించిన నాగంకు కాంగ్రెస్‌లో పరాభవం ఎదురుకావడంతో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గం బీసీ నేతలుగా పేరొందిన బీజేపీకి చెందిన మాజీ మంత్రి పీ.చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కూడా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఊహించని విధంగా ఈ నేతలంతా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో 14 నియోజకవర్గాల్లో ప్రభావం పడింది. టీపీసీసీ రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో బీఆర్ఎస్ నేతలు భారీ స్కెచ్ వేశారు. కొడంగల్‌తో పాటు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను మట్టి కర్పించేందుకు గులాబీ శ్రేణులు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. తెర వెనుక కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలకు టచ్‌లో ఉంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో కారు స్పీడ్‌కు తట్టుకోలేక బీజేపీ కేవలం మూడు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఓటమి భయంతో ఆ పార్టీ నేతలు చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు. మహబూబ్‌నగర్ కమలం పార్టీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను కాదని రాజకీయ అనుభవం లేని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఖంగుతిన్నారు. బీఆర్ఎస్తో టచ్‌లోకి వచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా కాంగ్రెస్ రెండో జాబితాలో తమ పేర్లు గల్లంతు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా అసమ్మతి చెలరేగుతున్నది. దేవరకద్రకు చెందిన బీసీ నేత ప్రదీప్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు సోమవారం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసి కుర్చీలు విరగ్గొట్టారు. రేవంత్ ఫ్లెక్సీలను చించేశారు. ఒక దశలో కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించగా మిగతావారు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మక్తల్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ నేత ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తన మద్దతు ధరలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానన్నారు. వనపర్తిలో ఇంకా అసమతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రముఖ కాంట్రాక్టర్ మేఘారెడ్డి ఢిల్లీలో పైరవీలు చేసిన టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకా అ నేక నియోజకవర్గాల్లో పార్టీ అసమ్మతి నేతలు రా జీనామాలు సమర్పిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి దారుణంగా తయారైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల పని ఖతమైందని కార్యకర్తలే బాహాటంగా అంటున్నారు.
నాడు రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడ్డ తెలుగుదేశం పార్టీ తెలంగాణ వచ్చినంక ఉమ్మడి జి ల్లాలో పూర్తిగా కనుమరుగైపోయింది గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఒకటి, రెండు స్థానాల్లో పోటీ చేసినా ఈసారి పోటీ వద్దని నాయకులు నిర్ణయించుకున్నారు. ఆ పార్టీకి ఎనలేని సేవలు చేసిన వనపర్తి జిల్లా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తాజాగా మంత్రులు కేటీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ పూరి గా తుడిచిపెట్టుకుపోయింది. వనపర్తి జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గతంలో నువ్వా.. నేనా.. అనే రీతిలో ఉన్న పోటీ ఇప్పుడు ఏకపక్షమైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. టికెట్ ఆశతో పార్టీలో చేరిన కాంట్రాక్టర్ మేఘారెడ్డికి మొండిచేయి చూపడంతో కాంగ్రెస్ పార్టీ పని ఖతం చేస్తానని శపథం పూనారు. ఈలోపు చాలామంది టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలంతా మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతుండడంతో ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయ్యింది. దేశం పార్టీ కూడా పోటీ చేయొద్దని నిర్ణయించడంతో ఆ పార్టీలో మిగిలిన కొద్ది మంది కారు ఎక్కుతున్నారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ వచ్చాక బీజేపీ, కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు సరైన గౌరవం దక్కలేదు. బీజేపీలో ఎంపీ టికెట్ ఇచ్చి ఓడగొట్టి పంపారు. 2018లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లే చేసి గులాబీ సునామీలో పార్టీ కొట్టుకపోయింది. తీరా ఈసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నాగంకు తన రాజకీయ బద్ధ శత్రువైన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కొడుకు రాజేశ్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. సీనియర్ నాయకుడైన తనకు ఘోర పరాభవం ఎదురు కావడంతో ఆయన కార్యకర్తల అభిష్టం మేరకు అనూహ్యంగా బీఆర్ఎస్లో చేరారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నాగం ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. దీంతో నాగం నాగర్‌కర్నూల్ కార్యకర్తల సాక్షిగా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రగతి భవన్‌కి వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఊహించని విధంగా నాగం గులాబీ కండువా కప్పుకోవడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారు. అధికారికంగా నాగం తన అనుచరుగడంతో పెద్ద ఎత్తున పార్టీ మారుతారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, అధికారం ఆ పార్టీకి గుండు సున్నా అంటూ నాగం నిప్పులుకక్కారు. నాగం చేరికతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి.
మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో దివంగత ఎర్ర సత్యం బీసీ నాయకుల్లో పేరున్న నేత. అనూహ్యంగా ఆయన మరణంతో సోదరుడు చంద్రశేఖర్ తెలుగుదేశం హయాంలో మంత్రి పదవులు చేపట్టి సత్యం ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. తనకు లేదా తన కూతురికి టికెట్ వస్తుందని ఆశతో ఆయన బీజేపీలో చేరారు. కానీ అధిష్టానం రాజకీయ అనుభవం లేని మాజీ ఎంపీ కొడుకుకు టికెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి గుడ్‌బై చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఎర్ర సత్యం ప్రాతినిథ్యం వహించిన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఆయన తమ్ముడు ఎర్రశేఖర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ సామాజిక వర్గాల ఐక్యతకు కృషి చేశారు. తెలంగాణ వచ్చాక టీడీపీలో ఉన్న రాజకీయ గౌరవం దక్కదని ఉద్దేశంతో బీజేపీలకి.. ఆ తర్వాత రేవంత్ మీద ఆశతో కాంగ్రెస్‌లోకి చేరారు. చివరకు నమ్ముకున్న రేవంత్ హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఈ ఇద్దరి రాకతో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో బలమైన బీసీల క్యాడర్ గులాబీ వైపునకు మళ్లింది. కొడంగల్, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్ , జడ్చర్ల నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీలను కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకే నష్టమని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేలా గులాబీ దళం దూసుకుపోతుంది.
కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ రాకపోవడంతో వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆ పార్టీ ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినా స్పందించకపోవడంతో సోమవారం వనపర్తి, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఏకంగా మహబూబ్‌గర్ జిల్లా ఆఫీసులో దేవరకద్రకు చెందిన ప్రదీప్‌గౌడ్ అనుచరులు హంగామా సృష్టించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి కుర్చీలు విరగ్గొట్టారు.. రేవంత్ ఫ్లెక్సీలను చించిపడేశారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీసీల గొంతు కోసేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ప్రదీప్‌గౌడ్ మండిపడ్డాడు. ప్యారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వమని రాహుల్ గాంధీ చెప్పినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. దేవరకద్ర టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సత్తా చూపిస్తానని ప్రకటించారు. మక్తల్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఆశించి భంగపడ్డ ప్రశాంత్ కుమార్‌రెడ్డి జక్లేర్ గ్రామంలో తన మద్దతుదారులతో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు.కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని విషయంపై భవిష్యత్ ప్రణాళిక కార్యకర్తలతో మాట్లాడి ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ కాంట్రాక్టర్ మేఘారెడ్డి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. గత ఎన్నికల్లోనే ఓటమిపాలై రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా.. అని ప్రకటించిన మాజీ మంత్రి చిన్నారెడ్డికే మళ్లీ టికెట్ కేటాయించడంపై మేఘారెడ్డి వర్గం మండిపడుతోంది.
ఈసారి టికెట్ వస్తుందని నమ్మకంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర పార్టీల నేతలను కూడగట్టారు. సోషల్ మీడియాలో అభ్యర్థిగా ప్రకటించారని హంగామా చేశారు. చివరకు వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ అధిష్టానం చిన్నారెడ్డికే టికెట్ కేటాయించింది. ఢిల్లీలో ఉండి పైరవీ చేసిన టికెట్ దక్కకపోవడంతో మేఘారెడ్డి తీవ్ర మదనపడుతున్నారట. ఘోర అవమానం పాలైన ఆయన తలెత్తుకోలేకపోతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి సత్తా చూపాలని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలో పోటీకి జంకుతున్నది. 14 నియోజకవర్గాల్లో కేవలం మూడు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకొన్నది. కల్వకుర్తి కొల్లాపూర్ నియోజకవర్గాల్లో అనుకున్న లీడర్లకే టికెట్లు కేటాయించినా మహబూబ్‌నగర్‌లో మాత్రం రాజకీయ అనుభవం లేని మాజీ ఎంపీపీ కొడుకుకు టికెట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోటీకి నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే టికెట్ ఇచ్చారే తప్ప గట్టి పోటీకి మాత్రం కాదని ఆ పార్టీ నేతలు అంటున్నాయి. చాలామంది టికెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిని కాదని టికెట్ కేటాయించడంపై లోలోపలే మదన పడుతున్నారు. వీరంతా గులాబీ గూటికి చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీకి చెం దిన అసంతృప్త , సీనియర్ నేతలంతా గులాబీ కండువా కప్పుకోవడంతో కారు స్పీడు మరింత పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 2018 ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవుతాయని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.