పంటలకు మూడు గంటల కరెంట్ మాత్రమే చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పది రోజులపాటు సభలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. సోమవారం నుంచి రైతువేదికల వద్ద సమావేశమై బీఆర్ఎస్ విధానాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ రైతు వ్యతిరేక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి సభలో వెయ్యి మంది రైతులు హాజరయ్యేలా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేయనున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ మూడు పంటల విధానంపై వివరించడంతోపాటు మరోపక్క కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చర్యలపై సమరశంఖం పూరించనున్నారు. ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ ఎలాంటి కుట్రలు చేస్తుందనే అంశాలపై చర్చించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రైతులకు క్షమాపణ చెప్పాలని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. బీఆర్ఎస్ మూడు పంటలు అంటుంటే.. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ చాలంటున్నదని రైతులు మండిపడుతున్నారు.
నాగర్‌కర్నూల్, జూలై 16(నమస్తే తెలంగాణ) : రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలను రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటాయన్న కాంగ్రెస్ నాయకుల మాటలను తిప్పికొట్టేలా రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్‌ను ఉచితంగా ఇస్తోంది. ఫలితంగా దండగన్న వ్యవసాయం నేడు పండుగలా మారింది. మారుమూల గ్రామాల్లోనూ బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్పై రైతుల్లో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేలా కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగా కేవలం 3గంటల విద్యుత్ చాలని, ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు.
ఈ మాటలతో గ్రామాల్లోని రైతన్నలు, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇప్పటికే రేవంత్, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ, నాయకులు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పది రోజులపాటు రైతు సభలు నిర్వహించాలని ఆదేశించారు. నేటి నుంచి పది రోజుల పాటు రైతువేదికల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. దీంతో రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ప్రతి సభలో రైతులు వేయిమందికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం చేసిన పథకాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూడు పంటల విధానంతోపాటు కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ విధానాన్ని ఎండగట్టనున్నారు. 2001లో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తాజా దురాలోచనను ప్రజలు, రైతుల్లోకి తీసుకెళ్లనున్నారు. అలాగే ఈ సదస్సుల్లో ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని తీర్మానించనున్నారు. ఉచిత కరెంట్‌ను రద్దు చేసే కుయుక్తులు పన్నుతున్న కాంగ్రెస్ విధానాలపై రైతాంగానికి అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు కేంద్రాలు కానున్నాయి.
కాంగ్రెస్‌ను నమ్మితే అంధకారమే
సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24గంటల పాటు ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. దీంతో మూడు పంటలు పండించుకుంటూ రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ విధానం ఉచిత విద్యుత్ రద్దు చేయడం. సమైక్య పాలనలో కూడా గంట కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ ఇప్పుడు ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మితే మళ్లీ అంధకారంలోకి వెళ్లాల్సిందే. 24గంటల కరెంట్ ఇస్తూ, మూడు పంటలు పండించేలా పనిచేస్తున్న బీఆర్ఎస్నే ప్రజలు, రైతులు నమ్మాలి. కాంగ్రెస్ విధానాలపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించేందుకు రైతువేదికల వద్ద సభలు నిర్వహిస్తున్నాం. నియోజకవర్గంలో ఈనెల 18న సభలు ఉంటాయి. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి.